న్యూఢిల్లీ: ఐపిఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ మార్చి 1వ తేదీ నుంచి ఢిల్లీ పోలీసు కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ గా పనిచేస్తారు. సీఎఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో ఆయనను కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్) నుంచి తెచ్చి శాంతిభద్రతల ప్రత్యేక కమిషనర్ గా నియమించారు. 

హోం మంత్రిత్వ శాఖ ఆయనను ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ రేపు శనివారం పదవీ విరమణ చేస్తున్నారు. అమూల్య స్థానంలో శ్రీవాస్తవ పోలీసు కమిషనర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. 

శ్రీవాస్తవ అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఏజీఎంయుటీ 1985 బ్యాచ్ అధికారి. అమూల్య పదవీకాలాన్ని ఇది వరకు నెల పాటు పొడిగించారు. ఆ గడువు రేపటితో ముగుస్తుంది. కొత్త పదవిలో చేరేందుకు సీఆర్పీఎఫ్ శ్రీవాస్తవను రిలీవ్ చేసింది.