న్యూఢిల్లీ: ఉద్యోగం చూపిస్తామని  చెప్పి 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. బాధితురాలి  తల్లి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఓ మహిళతో పాటు నలుగురిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.  రవి, రింకీ, రోహిత్, ముఖేష్‌లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీన అవుటర్ ఢిల్లీలో పరిధిలోని సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైందని కేసు నమోదైందని  అవుటర్ ఢిల్లీ పోలీస్  డిప్యూటీ కమిషనర్  సేజ్ పి. కురువిల్లా చెప్పారు.

బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాము ఈ విషయమై విచారణ చేస్తున్న సమయంలో  అభిషేక్ అనే వ్యక్తి  వద్ద  బాధితురాలు ఉందని తెలిసినట్టుగా పోలీసులు తెలిపారు.  ఈ నెల 21వ తేదీన  రోహిణిలో ఉన్న  బాధితురాలిని తీసుకొచ్చి నట్టు చెప్పారు. బాధితురాలిని  వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలి స్టేట్‌మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. అభిషేక్ అనే వ్యక్తి  తనను హరిద్వార్ తీసుకెళ్లాడని చెప్పారు.  అక్కడే  ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.  నాలుగు రోజుల తర్వాత ఆమెను పాత ఢిల్లీలోకి తీసుకొచ్చారు. అక్కడే రైల్వే స్టేషన్‌ ఫ్లాట్ పామ్ వద్ద రవిని కలిశారు. రవి వారికి ఉద్యోగం ఇస్తామని నమ్మించాడు.

ఘజియాబాద్‌‌లోని తమ ఇంటికి వారిద్దరిని రవి తీసుకెళ్లాడు. మరునాడు రవి వెంట అభిషేక్ వెళ్లాడు. కానీ, రవి తిరిగి రాలేదు. మరునాడు అభిషేక్ వచ్చి బాధితురాలిని తీసుకెళ్లనున్నట్టు  బాధితురాలిని నమ్మించాడు. 

అదే రోజు రాత్రి రవి భార్య రింకీ  ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది.బాధితురాలు, రవి మాత్రమే ఇంట్లో ఉన్నారు.  ఆ సమయంలో బాధితురాలిపై రవి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరునాడు రవి సతీమణి రింకీ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో రింకీకి బాధితురాలు తనపై రవి లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పైగా బాధితురాలికి భోజనం పెట్టింది.

ఆ భోజనం తిన్న తర్వాత బాధితురాలు మత్తులోకి జారుకొంది. ఆ సమయంలో ఇంతేజార్, హీనాలు  అక్కడికి వచ్చి తనను  రోహిణిలోని ఆశోక్ గోయల్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు.

ఆశోక్ గోయల్  స్పా మేనేజర్ గా పరిచయం చేసినట్టు బాధితురాలు  చెప్పారు. ఆశోక్ గోయల్  కూడ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు  అతని ఇద్దరు అనుచరులు  రోహిత్, ముఖేష్  కూడ ఆమెపై అత్యాచారం చేశారు.  స్పా‌ కు వచ్చే కష్టమర్లతో లైంగిక చర్యకు పాల్పడాలని తనను వేధించేవారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసులో  అభిషేక్ ను విచారిస్తే  తాను బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఒప్పుకొన్నాడు.  రవి, రింకీని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇంతేజార్, హీనా సహాయంతో  బాధితురాలిని విక్రయించినట్టు పోలీసులకు చెప్పారు.

స్పా మేనేజర్ గోయల్ తో పాటు అతని ఇద్దరు అనుచరులను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఇతర నిందితులను కూడ అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.