కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మర్నాడు ఆ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు అయితే, ఆస్పత్రి వెలుపల జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితురాలి తండ్రి మరణించాడు. 

గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు గోలు యాదవ్ తండ్రి కన్నౌజ్ జిల్లాలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పోలీసులు గోలు యాదవ్ ను అరెస్టు చేశారు. సామూహిక అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

తన కుమారుడిని చంపేశారని, పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి తండ్రి బుధవారం ఉదయం మీడియాతో చెప్పారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యుల్లో మరొకరు మంగళవారంనాడు చెప్పారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుక్షణం నుంచి ప్రధాన నిందితుడి అన్న తమను బెదిరిస్తూ వస్తున్నాడని చెప్పారు. తమ తండ్రి పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ అని, జాగ్రత్త అని హెచ్చరించినట్లు తెలిపారు. 

బాధితురాలికి వైద్య పరీక్షలు జరుగుతుండగా టీ తాగడానికి తండ్రి బయటకు వచ్చాడు. అప్పుడే ఓ ట్రక్ అతన్ని ఢీకొట్టినట్లు తెలిసిందని, వెంటనే కాన్పూర్ ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే అతను మరణించాడని, తాము ప్రమాదం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ పోలీసు చీఫ్ డాక్ర్ ప్రీతిందర్ సింగ్ ఓ వీడియో ప్రకటనలో తెలిపారు.