లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ పోలీసు కానిస్టేబుల్‌ కూతురిని అపహరించి, నడుస్తున్న కారులో ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. 

లక్నోలోని షహీద్‌ పాత్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాలు ప్రకారం.. బాధిత అమ్మాయికి తనపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు దుండగులు ఇంతకు ముందే పరిచయం. బబ్లూ, కాశీరాం జేపీ గుప్తా, హరీశ్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. 

దాంతో బాధితురాలు గతంలో వారికి రూ. 50వేలు ఇచ్చింది. డబ్బులు తీసుకొని చాలాకాలమైనా ఆ ముగ్గురు ఉద్యోగం ఇప్పించలేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయాన్ని వారు దాటేస్తూ వస్తున్నారు. గురువారం సాయంత్రం విభూతిఖండ్‌ వద్దకు రావాలని, డబ్బులు తిరిగి ఇస్తామని వారు బాధితురాలికి చెప్పారు. 

దాంతో ఆమె అక్కడికి వెళ్లింది. తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. నడుస్తున్న కారులో ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం జరిపారని, అనంతరం తాలిబగ్‌ ప్రాంతంలో కారు నుంచి తనను విసిరేసి వెళ్లిపోయారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు.