న్యూఢిల్లీ:భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

దేశం నుండి కరోనా ఎప్పటికి కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందనే విషయానికి మాత్రం కచ్చితంగా సమాధానం చెప్పడం లేదు. కానీ, కొందరు అధికారులు మాత్రం సెప్టెంబర్ మధ్య నాటికి కరోనా వైరస్ ఇండియా నుండి వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు.

 వైద్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరేట్ జనరల్ కు చెందిన పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య నాటికి ఇండియా నుండి కరోనా పూర్తిగా వెళ్లే అవకాశం ఉందన్నారు.

ఎపిడెమియాలజీ ఇంటర్నేషనల్ జనరల్‌లో ఆయన రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు. కుష్టు వ్యాధి డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ కు చెందిన డాక్టర్ రూపాలీ రాయ్ తో కలిసి ఆయన ఈ వ్యాసం రాశారు.

డాక్టర్ కుమార్ ఐఎఎన్ఎస్‌తో మాట్లాడారు. బెయిలీ మోడల్ అని పిలువబడే ప్రసిద్ద మోడల్ ఉందన్నారు. ఇది సాపేక్ష తొలగింపు రేటుపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్ని కేసులు పూల్‌లోకి ప్రవేశిస్తున్నాయి.ఎన్ని పూల్ నుండి బయటకు వెళ్లున్నాయన్నారు.  వ్యాధి సోకిన రోగులతో సమానంగా కోలుకొన్న రోగులు సమానమైతే ఆ సమయంలో ఈ వ్యాధి దేశం నుండి ఆవిరికానుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నమూనా ఏదైనా అంటువ్యాధికి వర్తిస్తోందన్నారు. ఏం చేసినా ఒక్క రోజుకు ఇది వంద శాతానికి చేరుకొంటుందన్నారు. సాపేక్ష తొలగింపు రేటు అంటే వైరస్ సోకిన వారంతా కోలుకొంటారు లేదా  చనిపోతారని ఆయన స్పష్టం చేశారు. 

ఈ ఏడాది మే 19న తాము చేసిన అధ్యయనం ప్రకారంగా  ప్రస్తుతం కరోనా రోగులు కోలుకొంటున్న సంఖ్య 42 శాతంగా ఉందన్నారు. కానీ అది ఇప్పుడు 50 శాతానికి చేరుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసానికి వంద శాతంగా ఉంటుందని అనిల్ కుమార్ చెప్పారు.

కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో రాష్ట్ర, జిల్లా డేటా విశ్లేషణకు ఉపయోగపడుతోందన్నారు. అంతేకాదు ఈ వైరస్ ను నియంత్రించే కార్యక్రమాలను తీసుకోవడంలో కూడ ఇది సహాయపడుతోందని ఈ అధ్యయనంలో తేలిందన్నారు.

దీర్థకాలిక వ్యాధుల నివారణకు ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొనేందుకు ఈ పద్దతి దోహాదపడుతుందన్నారు.తమకు అందుబాటులో ఉన్న డేటా నాణ్యత ఆధారంగానే  కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.

కరోనా కేసుల సంఖ్య నమోదులో పలు రాష్ట్రాలు పలు రకాలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన కేసులను నివేదిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు తేలికపాటి కేసులను నివేదిస్తున్నట్టుగా చెప్పారు. కొన్ని రాష్ట్రాలు తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాయి, మరికొన్ని రాష్ట్రాలు ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో కచ్చితమైన నివేదికలు ఇవ్వడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్ దేశంలో కరోనాపై మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. లాక్ డౌన్ అనేది మంచి ఆలోచన. అయితే పలు కారణాలతో దాన్ని ప్రభావంతంగా అమలు చేయలేకపోయినట్టుగా చెప్పారు.

దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేయలేదన్నారు. ఎంత మంది ప్రజలు ఈ వైరస్ బారినపడతారనే విషయమై కూడ ఊహించలేమన్నారు. భౌతిక దూరం పాటించడం, రానున్న రోజుల్లో ప్రజారోగ్య చర్యలు ఎలా ఉంటాయనే విషయాలపై ఆధారపడి ఉంటుందని  ఆయన తెలిపారు.

దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై కూడ కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు.కరోనా రాకుండా నిరోధించడం కూడ సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.