Covaxin: కరోనా లక్షణాలకు వ్యతిరేకంగా కొవాగ్జిన్ ప్రభావం 50 శాతం.. వెల్లడించిన తాజా అధ్యయనం.. కానీ..
భారత్‌లో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో (covid vaccination drive) ఉపయోగించే కీలక వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ (Covaxin) కూడా ఒకటి. కోవిడ్ లక్షణాలకు వ్యతిరేకంగా 50 శాతం మాత్రమే ప్రభావ వంతంగా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది.
కరోనాపై పోరులో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ కొవాగ్జిన్ (Covaxin) టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఉపయోగించే కీలక వ్యాక్సిన్లలో Covaxin కూడా ఒకటి. అయితే కొవాగ్జిన్ సమర్ధతపై తాజాగా వెలువడిని ఓ అధ్యయనం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే కొవాగ్జిన్ టీకా..కోవిడ్ లక్షణాలకు వ్యతిరేకంగా 50 శాతం మాత్రమే ప్రభావ వంతంగా ఉంటుందని ఆ అధ్యయనం పేర్కొంది. ప్రారంభంలో అనుకున్నదానికంటే తక్కువ ప్రభావ వంతంగా కొవాగ్జిన్ ఉందని ఇది సూచిస్తుంది.
అయితే కొవాగ్జిన్ రెండు డోసులు రోగ లక్షణ వ్యాధికి వ్యతిరేకంగా 77.8 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, తీవ్రమైన భద్రత సమస్యలు లేవని తెలిపింది. రియల్ వరల్డ్ అసెస్‌మెంట్ ఆధారంగా పరిశోధకులు ఈ మధ్యంతర అధ్యయనం చేశారు. లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో (Lancet Infectious Diseases Journal) ఈ అధ్యయనం పబ్లిష్ అయింది.
ఈ ఏడాది దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పరిశోధకులు హాస్పిటల్‌లో పనిచేసే 2,714 మంది నుంచి డేటాను విశ్లేషించారు. వీరంతా ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్యకాలంలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలు, ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకున్నావారు. వీరిలో 1,617 మందికి కరోనా పాజివ్‌గా తేలగా, 1,097 మందికి కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయింది.
ఈ పరిశోధన చేసినవారిలో వైద్యులు మనీష్ సోనేజా, ఆదిల్ రషీద్ ఖాన్, దేవాశిష్ దేశాయ్, అంకిత్ మిట్టల్‌తో పాటు మరికొందరు ఉన్నారు. అయితే తమ అధ్యయనానికి ఎటువంటి నిధులు రాలేదని, ప్రోటోకాల్‌ను ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోదించిందని వారు చెప్పారు. అయితే అధ్యయనం జరిగిన సమయంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ ప్రబలంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఆ సమయంలో.. మొత్తం ధ్రువీకరించబడిన కోవిడ్-19 కేసులలో డెల్టా వేరియంట్ దాదాపు 80 శాతంగా ఉంది.
‘మా అధ్యయనంలో అంచనా వేయబడిన వ్యాక్సిన్ ప్రభావం కొవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్ పూర్తయిన తర్వాత ప్రకటించిన సమర్థత కంటే తక్కువగా ఉందని పరిశోధకులు అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో తక్కువ ప్రభావాన్ని గమనించడానికి అనేక అంశాలు కారణమవుతాయని వారు చెప్పుకొచ్చారు. ‘మా అధ్యయనంలో ఉన్నవారు ఆసుపత్రి ఉద్యోగులు మాత్రమే. వారు సాధారణ జనాభా కంటే వైరస్ సంక్రమణ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశంలో సెకండ్ వేవ్ సమయంలో.. ఆసుపత్రి ఉద్యోగులు, ఢిల్లీ నివాసితులకు అధిక టెస్ట్ పాజిటివిటీ రేట్లు నమోదైన సమయంలో ఈ పరిశోధన నిర్వహించబడింది’ అని పరిశోధకులు తెలిపారు.
తమ అధ్యయనం జరిగిన కాలంలో ఏప్రిల్ 26న ఢిల్లీలో పాజిటిటీ రేటు దాదాపు 35 శాతంగా ఉంది.. ఇది కరోనా ప్రారంభమైనప్పటీ నుంచి అత్యధికం అని పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల తమ ఫలితాలు.. కరోనా తీవ్రత ఎక్కువగా పరిస్థితులలో కొవాగ్జిన్ పనితీరును మాత్రమే ప్రతిబింబిస్తాయి అని చెప్పావు. ఆ సమయంలో ఆందోళన కలిగించే వేరియంట్ల ప్రాబల్యం, డేల్టా వేరియంట్‌లు.. కొవాగ్జిన్ తక్కువ ప్రభావం చూపడానికి దోహదపడి ఉండవచ్చని అని తెలిపారు.
కొవాగ్జిన్ ఫేస్ 3 ట్రయల్ అనేది టెస్ట్-పాజిటివిటీ రేటు తక్కువ ఉన్న కాలంలో నిర్వహించబడిందని, ఒకేరకమైన కేసులలో డెల్టా వేరియంట్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా తెలియదుని వారు చెప్పారు. అంతేకాకుండా పరిశోధకులు వారి అధ్యయనానికి అనేక పరిమితులను గుర్తించారు. ఆసుపత్రిలో చేరడం, తీవ్రమైన వ్యాధి, మరణానికి వ్యతిరేకంగా టీకా ప్రభావాన్ని ఇది అంచనా వేయదని చెప్పారు. టీకా వేయించుకున్న తర్వాత వేర్వేరు సమయ వ్యవధిలో వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి లేదా టీకా ప్రభావం కాలక్రమేణా మారుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం రూపొందించబడలేదని తెలిపారు.
ఇక, కొవాగ్జిన్‌కు ఈ నెల 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించింది. తాజాగా కొవాగ్జిన్ టీకాల వాణిజ్య ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో భారత్ బయోటెక్ త్వరలో కొవాగ్జిన్‌ను విదేశాలకు ఎగుమతి చేయనుంది.