స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడంతో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఈ తరహా వివాహాలను భారతీయ సమాజం చిన్నచూపు చూస్తుండటం అందరికీ తెలిసిన విషయమే..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటే.. వారిద్దరు వరుసకు అక్కాచెల్లెళ్లు కావడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే... కాన్పూరు నగరానికి చెందిన ఓ యువతి తనకు వరుసకు చెల్లి అయ్యే యువతిని స్థానిక శివాలయానికి తీసుకెళ్లింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాను.. ఇద్దరు ఎరుపు రంగు స్కార్ఫ్‌ను ముఖానికి అడ్డుగా ధరించారు.

ఆలయానికి చేరుకుని.. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే ఆయన మాత్రం ఇందుకు నిరాకరించారు. అయినప్పటికీ పట్టువదలని ఇద్దరు యువతులు అక్కడే చాలాసేపు కూర్చొన్నారు. చివరికి తమకు తాముగా వివాహం చేసుకుని.. పెళ్లిఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా పేరొందిన వారణాసిలోనే ఇటువంటి సంఘటన జరగడం సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తోంది. స్వలింగ సంపర్కులకు వివాహ జరగటం వారణాసి చరిత్రలోనే తొలిసారని స్థానికులు చర్చించుకుంటున్నారు.