రాంచీ: న్యాయ శాస్త్ర విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో రాంచీ కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారంనాడు తీర్పు చెప్పింది. ఆ పదకొండు మంది దోషులు.... కుల్దీప్ ఉరావ్, సునీల్ ఉరావ్, సందీప్ తిర్కే, అజయ్ ముండా, రాజన్ ఉరావ్, నవీన్ ఓరోన్, బసంత్ కశ్యప్, రవి ఓరోన్, రోహిత్ ఓరోన్, సునీల్ ముండా, రిషీ ఓరోన్.

లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సివిల్ కోర్టు ఆవరణలో అదనపు భద్రత ఏర్పాట్లు చేశారు. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంఘటనపై వివిధ సెక్షన్ల 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై మహిళ నవంబర్ 27వ తేదీన ఫిర్యాదు చేసింది.

నిందితుల్లోని 12 మందిలో ఒకతను మైనర్. అతనిపై కేసు జువెనైల్ కోర్టులో పెండింగులో ఉంది. రాంచీలోని నేషనల్ లా యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థిని నవంబర్ 26వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఆ సంఘటన చోటు చేసుకుంది.

స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో వారిద్దరు కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగారు ఎనిమిది వ్యక్తులు లా విద్యార్థినిని కిడ్నాప్ చేసి, ఆమెను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. ఆమెపై వారు అక్కడ అత్యాచారం చేశారు. తర్వాత తమ ఇద్దరు మిత్రులను పిలిచారు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. 

బాధితురాలు నవంబర్ 27వ తేదీన కాంకే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మంది తమ నేరాన్ని అంగీకరించారు. ఆమెపై 12 మంది అత్యాచారం చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది.