Coronavirus : కరోనా టెన్షన్.. మరో నాలుగు జిల్లాలో మాస్క్ తప్పనిసరి..
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు ఆంక్షలు మళ్లీ మొదలుపెడుతున్నాయి. ఇటీవలి కాలంలోనే మాస్క్ తప్పనిసరి కాదని ప్రకటించిన ఆయా ప్రభుత్వాలు.. ఇప్పుడు మళ్లీ తప్పని సరి చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధానిలో, దాని చుట్టు పక్కల ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పలు జిల్లాలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించడం మళ్లీ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం 7 జిల్లాలో మాస్క్ తప్పని సరి చేయగా.. తాజాగా మరో రాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా హర్యానా ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల పెరుగుదల పెరుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంతో పాటు ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్ జిల్లాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మంగళవారం ప్రకటించారు.
సోమవారం హర్యానాలో నమోదైన 234 కేసుల్లో ఒక్క గురుగ్రామ్‌లోనే 198 కేసులు నమోదు అయ్యాయని మంత్రి అనిల్ విజ్ చెప్పారు. మిగిలిన వాటిలో 21 కేసులు ఫరీదాబాద్‌కు చెందినవని అన్నారు. అయితే సగానికి పైగా జిల్లాల్లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కొన్ని జిల్లాలో అసలు కేసులే నమోదు కావడం లేదని అన్నారు.
గురుగ్రామ్‌లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో అధ్యయనం చేయాలని అదనపు ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం) రాజీవ్ అరోరా నేతృత్వంలోని బృందాన్ని కోరినట్లు మంత్రి విజ్ చెప్పారు. దాని నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. అయితే దేశ రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా, తాము మాస్క్ ధరించడం తప్పనిసరి చేశామని మంత్రి అన్నారు. మాస్క్ లు ధరించకపోతే ఫైన్లు వేస్తామని అన్నారు.
గురుగ్రామ్‌లో ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయో అధ్యయనం చేస్తున్నామని అనిల్ విజ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ గురుగ్రామ్‌లో ఏ వేరియంట్ చెలామణిలో ఉందో తెలుసుకోవడానికి కొన్నినమూనాలను రోహ్‌తక్‌కు పంపించామని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హర్యానా వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘ కరోనాను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మాకు తగినంత పడకలు, పరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయి ’’ అని మంత్రి చెప్పారు. లక్నో, ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్న ఆరు జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడాన్ని ఉత్తరప్రదేశ్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్ జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 501 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ -19 టెస్ట్ పాజిటివిటీ రేటు సోమవారం 7.72 శాతానికి పెరిగింది. ఇది మునుపటి రోజు కంటే 16 తక్కువ. కొత్త కేసులతో ఢిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 18,69,051కి పెరిగింది. కొత్త మరణాలు ఏవీ సంభవించలేదు. కాగా ఆదివారం రోజు నగరంలో 507 కేసులు నమోదవగా.. కరోనాతో ఇద్దరు చనిపోయారు.