ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు  అధికారి భక్షకుడయ్యాడు.  పోలీసు అధికారి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి వచ్చిన మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే...ఒక మహిళ కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడిపై రేప్ కేసు పెట్టింది. ఆ తర్వాత దర్యాప్తు కోసం బివాండీలోని శాంతి నగర్ పోలీస్ స్టేషన్‌కు కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. నిందితుడు తాను మంచి స్నేహితులమని ఈ నేపథ్యంలో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధిత మహిళ నిర్ణయించింది. అందులో భాగంగానే కేసు దర్యాప్తులో ఉన్న శాంతి నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రోహన్‌ను ఆమె సంప్రదించింది. నేను నీ స్నేహితుడిని విడుదల చేస్తానని.. కానీ, రాజ్‌నోలీ బైపాస్ రోడ్డులో తనని కలవాలని ఎస్సై అడిగాడు. 

ఎస్సై కోరినట్లుగానే అక్కడి వెళ్లిన ఆమెను కల్యాణ్ టౌన్‌లోని గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  నవంబర్ 21న కొంగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సైపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కేసు దర్యాప్తులో ఉందని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.