సహజీవనం రేప్ కాదని సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే.. దానిని రేప్ గా పరిగణించలేమని సుప్రీం కోర్టు తెలిపింది. ఓ కేసు విషయంలో సుప్రీం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు.. డాక్టర్ పై పెట్టిన రేప్ కేసులో కోర్టు పైవిధంగా పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన ఓ నర్సుకి కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా.. ఓ ప్రమాదంలో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. 

ఈ క్రమంలో.. ఆమె డాక్టర్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా డాక్టర్ తో సహజీవనం చేస్తోంది. దీంతో.. అతనిని పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా కోరుతుండగా.. అతను నిరాకరించాడు.దీంతో.. ఆమె డాక్టర్ పై రేప్ కేసు పెట్టింది.

ఈ కేసు విషయంలో.. ‘రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదు వచ్చిన వ్యక్తి బాధితురాల్ని నిజంగానే వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేదా అతనికి ఏదైనా దురుద్దేశం ఉందా? తన కోరికను తీర్చుకోవడానికి ఆమెకు తప్పుడు ప్రమాణం చేశాడా? అని పరిశీలించాలి. నిందితుడి మాయలో పడిపోవడం ద్వారా కాకుండా, అతనిపై ప్రేమ కారణంగా బాధితురాలు శృంగారంలో పాల్గొంటే అలాంటి సందర్భాల్లో వారి మధ్య సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం’అని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.