తను ఎత్తుకున్న బిడ్డ దేశంలోని అతి పురాతన పార్టీకి అధ్యక్షడైతే.. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తే అచ్చం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. వయ్‌నాడ్‌కు చెందిన రాజమ్మ పతివాల్. ఆమె ఎత్తుకుంది ఎవర్నో కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని.

ప్రస్తుతం వయ్‌నాడ్‌ పర్యటనలో ఉన్న రాహుల్ రాజమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆశ్చర్యపరిచారు. దశాబ్ధాల తర్వాత రాహుల్‌ను చూసిన ఆమె ఆనందంతో గాల్లోకి తేలింది. 1970, జూన్ 19న రాహుల్ పుట్టినప్పుడు రాజమ్మ అదే ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్నారు.

ఆయన పుట్టగానే ఎత్తుకున్న వారిలో తానూ ఒకరినని ఆమె గతంలో ఓ సందర్భంలో చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వయ్‌నాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని తెలిసి రాజమ్మ ఎంతో సంతోషించారు.

ఇప్పుడు ఏకంగా యువనేత ఆమెను కలవడానికి వెళ్లడంతో రాజమ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆయనను ప్రధానిగా చూడాలన్నదే తన కల అని ఆమె తెలిపారు. కాగా.. రాహుల్ పౌరసత్వంపై ఆరోపణలు వచ్చిన తరుణంలోనూ రాజమ్మ స్పందించి ఆయన భారతీయుడేనని అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.