హర్యానాలో మత ఘర్షణలు.. నుహ్ లో రాళ్లు విసిరేందుకు అవకాశం ఇచ్చిన హోటల్ కూల్చివేత..
హర్యానాలో మతపరమైన ఘర్షణలకు కారణమైన వారికి ఆశ్రయమిచ్చిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అవి అక్రమంగా నిర్మించినవని పేర్కొంటూ వాటిపై బుల్డోజర్ చర్యకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా నుహ్ లోని ఓ హోటల్ ను కూల్చేశారు.
హర్యానాలో మత ఘర్షణలకు కారణమైన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది. తాజాగా నుహ్ లో సహారా హోటల్ పై కూడా అక్కడి ప్రభుత్వం బుల్డోజింగ్ చర్యకు పూనుకుంది. ఈ హోటల్ పై నుంచే మతపరమైన ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారని అధికారులు గుర్తించారు. దీంతోనే హింస ప్రారంభమైందని అధికారులు భావిస్తున్నారు. పైకప్పు నుంచి రాళ్ల దాడి చేయడంతో 2,500 మందికి పైగా పాల్గొన్న ఈ ఊరేగింపు చెల్లాచెదురయ్యింది. తమను తాము రక్షించుకునేందుకు వారంతా ఆలయంలోకి పరుగులు తీశారు.
కాగా.. ఈ హింసకు కారణమైన, నిందితులకు ఆశ్రయం కలిగించిన కట్టడాలను అధికారులు కూల్చివేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మెడికల్ షాపులు సహా దాదాపు డజను దుకాణాలను శనివారం కూల్చివేశారు. హింసాత్మక నూహ్ కు 20 కిలోమీటర్ల దూరంలోని తౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు ఈ వారం ప్రారంభంలో కూల్చివేశారు.
కూల్చివేసిన కొన్ని దుకాణాలు, ఇళ్లు ఇటీవల జరిగిన ఘర్షణల్లో పాల్గొన్న వారివేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 50 నుంచి 60 వరకు నిర్మాణాలను కూల్చివేశారు. అయితే అరెస్టులకు భయపడి చాలా మంది పారిపోయారు. నూహ్ లోని వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించామని, గత కొన్నేళ్లుగా తొలగించలేని అక్రమ ఆక్రమణలను అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై మూకలు దాడి చేయడంతో నూహ్ లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. సాయంకాలం గడిచే కొద్దీ హింస మరింత పెరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక మసీదును తగలబెట్టారు. నుహ్, పొరుగున ఉన్న గురుగ్రామ్ లో అల్లరిమూకలు రెచ్చిపోవడంతో వందకు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి.
ఈ హింస వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు, అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా.. ఈ ఘర్షణల వెనుక సూత్రధారి ఎవరనే ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని నుహ్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటి వరకు 106 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 216 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై 24 ఎఫ్ఐఆర్ లు, హింసకు దారితీసే కంటెంట్ ను పోస్టు చేసిన నలుగురిని అరెస్టు చేశారు.