ఇక నుంచి బస్సు డ్రైవర్లు ఆడవాళ్లతో మాట్లాడటానికి వీలులేదట. సాధారణంగా.. ముందు సీట్లలో కూర్చునే మహిళలతో అప్పుడప్పుడు డ్రైవర్లు మాటలు కలుపుతారు. అంతేకాకుండా బస్ రష్ గా ఉంటే... నిలబడటానికి కూడా ఇబ్బందిగా ఉంటే బ్యానెట్ పై కూర్చోనిస్తారు. అయితే.. ఇక నుంచి అవన్నీ కుదరవు. ఈ రూల్స్ కచ్చితంగా డ్రైవర్లు పాటించాల్సిందేనని రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. అయితే... ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి.... తమిళనాడులో.

Also Read తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి, 20 మందికి గాయాల

రాష్ట్రంలో చెన్నై, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, కోయంబత్తూరు, విల్లుపురం, తిరునల్వేలి, కుంభకోణం డివిజన్లుగా రవాణా సంస్థ బస్సుల సేవలు సాగుతున్నాయి. 22 వేల మేరకు బస్సులు నిత్యం రోడ్డుపై  పరుగులు తీస్తున్నాయి.  ప్రధానంగా బస్సుల్ని నడిపే సమయంలో డ్రైవర్లు అత్యధికంగా సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నట్టుగా వీడియో ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి.

అంతేకాకుండా ముందు సీట్లలో మహిళలు కూర్చుంటే..  వారితో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం లేదా బ్యానెట్‌పై మహిళలను కూర్చొబెట్టి మాట్లాడడం వంటి చర్యలకు అనేక మంది డ్రైవర్లు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రవాణా సంస్థకు వచ్చి చేరాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో డ్రైవర్లకు ఆంక్షల చిట్టాను రవాణా సంస్థ ప్రకటించింది.మహిళలతో మాట్లాడినా.. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం గమనార్హం.