కోల్‌కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్త హత్యను నిరసిస్తూ చలో నబాన్నా పేరుతో సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సెక్రటేరియేట్ ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన కాషాయ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

24 పరగణాల జిల్లాల్లోని తైదాఘర్‌లో ఈ నెల 4న బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యతో పాటు గత కొన్నాళ్లుగా బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ చలో నబాన్నా పేరుతో సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది.

ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉదయం నుంచే కోల్‌కతాలో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సెంట్రల్ కోల్‌కతా, హేస్టింగ్స్, హౌరా తదితర ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటుతుండటంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. దీంతో నగరంలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.