తనపై వస్తున్న లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఖండించారు. అవన్నీ నిరాధారమని, ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని.. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ... కానీ తానెవరికీ భయపడని స్పష్టం చేశారు. ఈ కుర్చీలో కూర్చొని ఎలాంటి భయం లేకుండా విధులను నిర్వర్తిస్తానన్నారు.  

న్యాయమూర్తిగా 20 ఏళ్ల పాటు పనిచేశానని, తన బ్యాంక్ ఖాతాలో రూ.6.80 లక్షలు ఉన్నాయన్నారు. న్యాయవ్యవస్థను బలిపశువును చేయకూడదని.. ఈ విషయాన్ని మీడియా సంస్థల విజ్ఞతకే వదిలేస్తున్నాని గొగొయ్ స్పష్టం చేశారు.

మీడియాలో వచ్చిన ఈ ఆరోపణల సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం జస్టిస్ రంజన్ గొగొయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బెంచ్ దీనిపై విచారణ జరిపింది.

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని నడిపించే ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దేశంలో చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళ ఆరోపించారు.

ఏకంగా తన నివాస కార్యాలయంలోనే గొగొయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆమె ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు లేఖ రాయడం దేశ న్యాయవ్యవస్థలో కలకలం రేపింది.

గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో రంజన్ వెనుక నుంచి నా నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నారని, అనంతరం చేతులతో తన శరీరమంతా తడిమారని.. గట్టిగా హత్తుకుని.. తనను కూడా కౌగిలించుకోమన్నారని ఆమె లేఖల్లో పేర్కొన్నారు.

ఈ చర్యలతో తీవ్ర భయాందోళనలకు గురైన తాను ఆయన బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగిన 2 నెలలకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం అనుమతి లేకుండా ఒక రోజు సెలవు తీసుకున్నందుకు తనను సర్వీసు నుంచి తొలగించామని చెప్పారని వాపోయారు. అక్కడితో ఆగిపోకుండా ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తన భర్, తన భావలను 2012లో జరిగిన ఓ కాలనీ వివాదాన్ని బయటకు తీసి గతేడాది డిసెంబర్ 28న విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

దీంతో తన భర్తతో కలిసి రాజస్థాన్‌లో ఉండగా... ఓ చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అక్కడి5కి చేరుకున్నారని.. తాను సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు నమోదు చేయించారన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబంతో పాటు తన బావ కుటుంబసభ్యులను సైతం అరెస్ట్ చేశారని.. 24 గంటల పాటు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి, దూషించడంతో పాటు భౌతికంగా దాడి చేసినట్లు వెల్లడించింది.

అంతేకాకుండా దివ్యాంగుడైన మా బావ సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంట్‌గా నియమితులైతే కారణం లేకుండా ఆయనను సైతం విధుల నుంచి తప్పించారని వాపోయింది.