Asianet News TeluguAsianet News Telugu

బిజెపి వ్యతిరేక కూటమికి ఊపు: చంద్రబాబుతో మమతా, మాయ చర్చలు

కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Chandrababu speaks with Mayawati, Mamata

బెంగళూరు: కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతోనూ, బిఎస్పీ అధినేత మాయావతితోనూ చర్చలు జరిపారు. 

బెంగళూరు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపి, తమ సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. 

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అక్కడే ఉన్నారు. 

అంతకుముందు మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ అయినట్లు సమాచారం. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరితో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మమతకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు.

బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరమని, కూటమిని ఏర్పాటు చేయాలని ఏపీ చంద్రబాబుకుమమతా బెనర్జీ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. 

మాయావతి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ప్రాంతీయ పార్టీల కూటమి అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాల హక్కులను హరించేలా 15వ ఆర్థికసంఘం సిఫార్సులు ఉన్నాయనే చంద్రబాబు అబిప్రాయంతో కేజ్రీవాల్, మమత ఏకీభవించారు. 

బీజేపీతో టీడీపి తెగదెంపులు చేసుకున్న తర్వాత ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్రంపై పోరాటాన్ని చంద్రబాబు వారికి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios