తానే దేవుడినంటూ స్వయంగా  ప్రకటించుకున్న దాతీ మహరాజ్ పై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు విచారణను సిబిఐ చేపట్టింది. ఇందుకోసం ఇవాళ సిబిఐ దాతిపై అసహజ శృంగారానికి సంబంధించిన కేసు నమోదు చేసింది.

దక్షిణ ఢిల్లీతో పాటు రాజస్థాన్ ప్రాంతాల్లో దాతి మహారాజ్ కు ఆశ్రమాలున్నాయి. అయితే అతడికి సంబంధించిన ఓ ఆశ్రమానికి వెళ్లినపుడు దాతి మహరాజ్ తో పాటు అతడి  ముగ్గరు సోదరులు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ భక్తురాలు డిల్లీలోని బేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో  జూన్ 22 న దాతి మహరాజ్(దాతి మదన్ లాల్) పోలీసులు కేసు నమోదు చేసుకుని పలుమార్లు విచారించారు.

అయితే ప్రలోభాల ప్రభావంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ సరిగా చేయలేదని డిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ వీకే రావులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. హైకోర్టు సూచనల మేరకు సిబిఐ కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతోంది. 

అయితే తనను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని దాతి మహారాజ్ ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రల్లో ఇదీ ఓ భాగమైనని ఆయన ఆరోపిస్తున్నారు.