పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు మౌజ్‌పూర్, జఫ్రాబాద్, కర్నాల్ నగర్, చాంద్‌బాగ్‌లలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

ఇదే సమయంలో ఢిల్లీ లా అండ్ ఆర్డర్ స్పెషల్ పోలీస్ కమీషనర్‌గా ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఎస్ఎన్ శ్రీవాత్సవను నియమించింది. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:సీఏఏ అల్లర్లు: ఆగని హింస, పరిస్థితిని గమనిస్తున్న కేంద్రం

అల్లర్ల దృష్ట్యా రేపు పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు, పోలీసులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో షాపులకు, బైకులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 

అల్లర్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. మరోవైపు పరిస్ధితి అదుపు తప్పడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

Also Read:ఢిల్లీలో అల్లర్లు: 9కి పెరిగిన మృతుల సంఖ్య, ఎన్డీటీవీ రిపోర్టర్లపై దాడి

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు, గోకుల్ పురి, మౌజ్‌పూర్, బ్రహ్మంపురీ ప్రాంతాల్లో ఇవాళ కూడా నిరసనకారులు రాళ్లు రువ్వుకున్నారు. జఫ్రాబాద్, చాంద్‌బాగ్, మౌజ్‌పూర్‌లో అదనపు బలగాలను మోహరించారు. 35 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు ఈ హింసపై విచారణ జరపాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.