భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న పారిశుద్ధ్యం విషయంలో మాత్రం వెనకే ఉంది. ముఖ్యంగా స్త్రీలకు పబ్లిక్ ప్రాంతాల్లో పబ్లిక్ టాయ్‌లెట్స్ నిర్మాణం విషయంలో మాత్రం భారత్ ఇంకా ఓనమాల దశలోనే ఉంది. స్వచ్ఛభారత్ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

 

 

అయితే పుణేకు చెందిన ఉల్కా సదల్కర్, రాజీవ్ ఖేర్‌లు స్త్రీల ఇబ్బందిని గుర్తించి వినూత్న ప్రయోగం చేశారు. బస్సును మొబైల్ టాయ్‌లెట్‌గా మార్చి మహిళల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

పుణేలోని వివిధ ప్రాంతాల్లో ‘‘వాష్‌రూమ్ ఆన్ వీల్స్’’ పేరిట 12 బస్సులను ఏర్పాటు చేశారు. 2016లో ప్రారంభించిన ఈ ‘‘Ti Toilet’’ ప్రాజెక్ట్‌‌లో టీ అంటే మరాఠీలో ఆమె అని అర్థం. దీనికి మహిళలు, విద్యార్ధినిల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

Also Read:భారత పర్యటనకు ట్రంప్ తో పాటుగా అతని కుమార్తె ఇవాంకా!

పూర్తి పర్యావరణ అనుకూలంగా రూపొందించిన ఈ మొబైల్ వాష్‌రూమ్స్‌ నడిచేందుకు సౌర విద్యుత్తును వినియోగిస్తున్నారు. బస్సుపై బిగించిన సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్‌‌శక్తి ఉత్పత్తి అవుతుంది.

పోర్టబుల్ పారిశుద్ధ్య వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ జంట ప్రస్తుతం పూణేలోని పరిశుభ్రతను మెరుగుపరచటంపై దృష్టి పెట్టింది. మహిళలు శుభ్రమైన మరియు సురక్షితమైన వాష్‌రూమ్‌లను వినియోగించాలనే ఉద్దేశ్యంతోనే వీటిని రూపొందించామని ఎంఎస్ సదల్కర్ తెలిపారు.

 

 

అదే సమయంలో రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 1,000 వాష్ రూమ్‌లను తెరవాలని ఈ జంట భావిస్తున్నారు. ఈ బస్సులను మొబైల్ వాష్‌రూమ్‌లుగా తయారు చేసే క్రమంలో వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని.. ఇందులో శుభ్రమైన మరుగుదొడ్లు, టెలివిజన్ సెట్లు, టెంపరేచర్ మానిటర్లను సైతం అమర్చినట్లు తెలిపారు.

ఈ మొబైల్ వాష్‌రూమ్‌లలో ఒకదానిని నిర్వహిస్తున్న మనీషా అధవ్ మాట్లాడుతూ.. మల మూత్ర విసర్జన కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు తమ వాహనం వద్దకు వస్తారని, తిరిగి వెళ్లేటప్పుడు తనను ఆశీర్వదించి వెళతారని ఆమె పేర్కొన్నారు.

Also Read:100కోట్ల హిందువులపై ఆధిపత్యం చేస్తాం..ఐఎంనేత వివాదాస్పద కామెంట్స్

పబ్లిక్ టాయ్‌లెట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడుతున్నాయని.. సరైనా పర్యవేక్షణ లేని కారణంగా అవి నిరూపయోగంగా మారుతున్నాయని నిపుణుల అంచనా. గతేడాది అక్టోబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జనరహితంగా ప్రకటించారు.

అప్పటికి దేశవ్యాప్తంగా 600 మిలియన్ల మందికి మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అయితే నిపుణులు ఈ గణాంకాలను తప్పుబట్టారు. అత్యవసర సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన వాష్‌రూమ్‌లను కనుగొనడం అంత సులభం కాదని.. తాము దీనిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అధవ్ చెప్పారు.