బ్యాంకులోకి ప్రవేశించిన ఎద్దును చూసి ఖాతాదారులు , సిబ్బంది భయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది
లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాహ్ గంజ్ బ్రాంచీలోకి ఎద్దు ప్రవేశించింది. దీంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎద్దును బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తి బయటకు పంపించి వేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు లోపలకి ఎద్దు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్యాంకులోకి ప్రవేశించిన ఎద్దు ఖాతాదారులు నిలబడి ఉండే స్థానంలో నిలబడింది. ఎద్దును చూసిన ఖాతాదారులు భయంతో బ్యాంకులో ఒకవైపునకు వెళ్లి నిలబడ్డారు. మరో వైపు ఎద్దును చూసిన బ్యాంకులోని సిబ్బంది కూడ ఆందోళనకు గురయ్యారు. భయంతో సెక్యూరిటీ గార్డును పిలిచారు. ఎద్దు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు చేరుకొని ఎద్దును బయటకు పంపారు.
బ్యాంకు లోపలికి ఎద్దు ప్రవేశించిన నుండి బ్యాంకు బయటకు ఎద్దును పంపే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఈ వీడియోపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల కోసం ఎద్దు బ్యాంకుకు వచ్చిందేమోనని ఆయన ఎద్దేవా చేశారు.
