Budget 2022: 2.37 లక్షల కోట్ల MSPని నేరుగా రైతులకు చెల్లిస్తాం: ఆర్థిక మంత్రి నిర్మలా
Budget 2022: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022 లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో రైతులకు పలు కార్యక్రమాలను ప్రకటించింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2022: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలోని ప్రధాన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి.. ఉత్పాదక రంగం, సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది.
బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం తమ ప్రాధాన్యాల్లో ఒకటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రబీలో గోధుమలు, ఖరీఫ్‌లో వరి సేకరిస్తున్నామన్నారు. రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను, అలాగే 63 లక్షల మెట్రిక్ టన్నుల వరిధానాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. గోధుమ, వరి రైతులకు కనీస మద్దతు ధర (MSP) ప్రకారం రూ. 2.37 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు.
సుస్థిర వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీతారామన్ చెప్పారు. పంట అంచనా, పురుగుమందుల స్పేయింగ్ కోసం కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు.
2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిన నేపథ్యంలో తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. ఇక ఆయిల్ విత్తనాల దిగుమతి తగ్గించేందుకు స్థానికంగానే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సాగు నీటి కోసం.. కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును సీతారామన్ ప్రకటించారు. రూ.44 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె అన్నారు. ఐదు నదుల అనుసంధానానికి సంబంధించిన ముసాయిదా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయిందని తెలిపారు.
2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను ప్రభుత్వం రీకాల్ చేయడంతో వ్యవసాయ ఉత్పత్తులకు MSPని ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన ముగిసిన రెండు నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ బడ్జెట్ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపనున్నది .