Asianet News TeluguAsianet News Telugu

సీబీఎస్ఈ టాపర్ గ్యాంగ్ రేప్ పై బీజేపీ మహిళా ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

సీబీఎస్ ఈ టాపర్ గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు, నైరాశ్యానికి గురైన వారే లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

bjp mla premlata says unemployment main reason rapes
Author
Chandigarh, First Published Sep 15, 2018, 4:54 PM IST

ఢిల్లీ : సీబీఎస్ ఈ టాపర్ గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు, నైరాశ్యానికి గురైన వారే లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అత్యాచారానికి గురైన విద్యార్థినిపై సానుభూతి చూపించాల్సింది పోయి నిరుద్యోగులు కోపం, చిరాకులో ఉన్నప్పుడు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చెయ్యడం వివాదాస్పదంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే హర్యానాలో సీబీఎస్ఈ టాపర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. 19 ఏళ్ల బాలికను మహేంద్రగఢ్ లోని ఓ బస్టాండ్ దగ్గర కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు రేవరిలోని ఓ గృహంలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కోచింగ్ కు వెళ్లి వస్తున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అదే బస్టాండ్ లో విడిచిపెట్టి పరారయ్యారు. 

 బాధితురాలి తండ్రి తన కూతరుకి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం మేవట్ ఎస్పీ నాజ్నేన్ భాసిన్ ఆధ్వర్యంలో సిట్ ని ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా ఉచానా కాలన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి లేని యువత ఆ ఒత్తిడిలో ఇలాంటి అత్యాచార నేరాలకు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నైరాశ్యానికి గురై, ఉద్యోగాలు లేని పిల్లలే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో మహిళా ఎమ్మెల్యే అయి ఉండి నిర్లక్ష్యంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ప్రేమ్ లత సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి సాయం చేసిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు.

నిందితులను పట్టుకునేందుకు సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. నిందితులంతా తమ గ్రామానికి చెందిన వారేనని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి సమాచారంతో రంగంలోకి దిగిన సిట్ బృందం ప్రధాన నిందితుడు రాజస్తాన్‌లో డిఫెన్స్‌ అధికారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని తీసుకువచ్చేందుకు రాజస్థాన్ వెళ్లినట్లు హరియాణా డీజీపీ బీఎస్ సాధు తెలిపారు. 

సామూహిక అత్యాచార ఘటనపై సౌత్‌ వెస్ట్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ చెరిశ్‌ మాథ్సన్‌ స్పందించారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను నేరానికి పాల్పడినట్లు తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరస్థులకు తాము ఎప్పటికీ ఆశ్రయం ఇవ్వబోమన్నారు.  

 విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఒక నిందితుడిని గుర్తించామని అతడిని అరెస్ట్ చేస్తామని డీజీపీ సాధు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితులంతా విద్యార్థినికి తెలిసినవారేనని స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios