త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తృణమూల్ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహాకర్తగా జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దీనిపై ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలు స్పందించారు. తాజాగా బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ వర్గీయ మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహాలన్నీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వద్దే నేర్చుకున్నారన్నారు.

ఎన్నికల వ్యూహాల్లో అమిత్ షా ప్రిన్సిపాల్ అయితే... ప్రశాంత్ కిశోర్ స్టూడెంట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా షా కంటే పెద్ద రాజకీయ వ్యూహకర్త ఎవరున్నారు.. ఈ విషయాన్ని అందరూ మరచిపోయారనుకుంటా అని వర్గీయా అన్నారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం మరోసారి రుజువైందని ఆయన గుర్తు చేశారు. మమతా బెనర్జీకి రాజకీయాలు ఇలా చేయాలని తెలియకనే ఇతరుల మీద ఆధారపడుతున్నారని.. ఇక ఆమె సీఎంగా ఎలా పనిచేస్తారంటూ కైలాశ్ ప్రశ్నించారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీకి, 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. అనంతరం జేడీయూలో చేరి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. దీంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్.. తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వెళ్తార్న వార్తలపై జేడీయూ శ్రేణులు సందిగ్థంలో పడ్డాయి.