కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ మన దేశానికీ పాకేసింది.  రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో దాదాపు 6వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ఇంతలా వ్యాపించడానికి ముందే అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. మరో నాలుగు రోజుల్లో ఈ లాక్ డౌన్ ముగియనుంది. అయితే.. దానిని పొడిగించాలని కేంద్రం, రాష్ట్రాలు భావిస్తున్నాయి.

Also Read కరోనాను అడ్డుకునేందుకు ‘‘షీల్డ్‌’’తో వస్తున్న కేజ్రీవాల్...

ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను  రక్షించేందుకు ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. వైరస్ మహమ్మారి బయట ఉన్నా.. ప్రాణాలకు తెగించి పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను కొనసాగిస్తున్నారు. అయితే.. వారి త్యాగాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోలేని కొందరు ఆకతాయిలు.. రోడ్ల మీద తిరగడానికి ప్రయత్నిస్తున్నారు.

దీంతో.. అలాంటి వాళ్లను పోలీసులు పట్టుకొని బడిత పూజ చేస్తున్నారు. తాజాగా... ఇలాంటి సంఘటనే ముంబయిలో చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఎక్కడ పోలీసులు ఆపుతారో అనే భయంతో.. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. విధుల్లో ఉన్న పోలీసు నుంచి తప్పించుకునేందుకు అతనిని పట్టుకోని లాక్కెళ్లాడు.

సదరు వ్యక్తి ద్విచక్రవాహనం నడుపుతుండగా.. తన బైక్ వెంట పోలీసుని దాదాపు 50మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో గురువారం చోటుచేసుకుంది.

గాయపడిన పోలీసు అధికారి ఇన్స్నెక్టర్ విజేంద్ర దూరత్ కాగా.. నిందితుడు కాజాబి షేక్ నయూమ్(42) గా గుర్తించారు. లాక్ డౌన్ వేళ బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కాజాబి షేక్ వాహనం కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు స్క్ర్రీనింగ్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వారికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుకి తీవ్రగాయాలు చేశాడు.

ప్రస్తుతం పోలీసు అధికారి ఆరోగ్యం కుదుటుగానే ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.