పాట్నా: బీహార్ రాష్ట్రంలో అత్యంత అమానుషపమైన సంఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన మహిళ పట్ల మానవత్వం మరిచిపోయి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఆమెను చిత్రహింసలు పెడుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఓ కరెంట్ స్తంభానికి వేలాడదీశారు. ప్రస్తుతం ఆమె కదలలేని స్థితిలో ఉంది. ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉంది. బీహార్ లోని సమస్తీపూర్ ప్రాంతంలో గల చఖాబిట్ రుథియా గ్రామంలో సోమవారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. 

మంగళవారం ఉదయం స్పృహ కోల్పోయిన మహిళను స్థానికులు దాల్ సింగ్ సరాయ్ లోని సబ్ డివినల్ ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో గ్రామస్తులు ఏడుగురు కూలీలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విషయం బయటకు చెప్తే చంపేస్తామని వారు ఆమెను బెదిరించారు. 

అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సమయంలో వారిని మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. బాధితురాలి నివాసంలో వివాహ కార్యక్రమం ఉంది. టెంట్ల కింద పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ దాడి వెనక ఆ కార్మికులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఏడుగురు కార్మికులను ప్రశ్నిస్తున్నారు. 

30 ఏళ్ల వయస్సు గల బాధితురాలి మరదలి పెళ్లికి కూలీలు టెంట్లు, క్రాకరీ తెచ్చారు. ఏడుగురిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.