న్యాయం చేయడమంటే ఏంటి...? బాధితులకు సహాయం చేయడం.. బాధించిన వారికి శిక్ష వేయడం . కానీ ఓ గ్రామంలో బాధితురాలికే శిక్ష వేశారు. తప్పు చేసిన వారిని మాత్రం ఒక్క మాట కూడా అనకుండా వదిలేశారు. తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పంచాయతీ పెద్దలను ఆశ్రయిస్తే... బాధితురాలికి గుండు గీసి ఊరిలో ఊరేగించారు. ఈ దారుణ సంఘటన బిహార్ రాష్ట్రం గయలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గయకి చెందిన ఓ యువతిని ఈ నెల 14వ తేదీన అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానిక పంచాయతీ భవనం వద్దకు యువతిని తీసుకువెళ్లి...పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో.. యువతి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. మరుసటి రోజు స్థానికులు ఎవరో యువతిని అక్కడ పడిపోయి ఉండటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

దీంతో... యువతి తల్లిదండ్రులు... నిందితులను శిక్షించాలని కోరుతూ పంచాయతీని ఆశ్రయించారు. అయితే.. నిందితులు స్థానింగా బాగా పేరు, సంపాదన ఉన్న కుటుంబీకులు కావడంతో... పంచాయతీ  పెద్దలు కూడా వారికి శిక్ష విధించడానికి ముందుకు రాలేదు. పైగా యువతిదే తప్పు అని తేల్చేశారు.

అంతేకాకుండా బలవంతంగా యువతికి గండు గీసి ఊరిలో ఊరేగించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తప్పు చేయని యువతికి శిక్ష వేసిందుకు గగాను వారిపై కూడా పోక్సో చట్టం నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.