త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేయనున్నరన్న వార్తలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వార్తలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు.

ప్రశాంత్ కుమార్.. దీదీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయంపై తన దగ్గర ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘ ఆదివారం జేడీయూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతందని... దీనికి ప్రశాంత్ కిశోర్ కూడా హాజరవుతారని .. ఈ అంశంపై ఆయన అక్కడ మాట్లాడతారని నితీశ్ తెలిపారు.

గతేడాది తమ పార్టీలో చేరినప్పుడు ఉపాధ్యక్షుడిగా నియమించామని గుర్తుచేశారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ.. ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది.. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలతో జేడీయూకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాగా.. టీఎంసీతో ప్రశాంత్ కిశోర్ ఒప్పందం కుదుర్చుకోవడం నీతీశ్ కుమార్‌కు మింగుడు పడటం లేదు.. ఎందుకంటే ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూలో ఆయన కీలకంగా ఉన్నారు.

బీజేపీకి ప్రత్యర్థిగా.. ప్రధాని నరేంద్రమోడీతో ఢీ కొడుతున్న మమతా బెనర్జీ పార్టీకి ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా వెళ్తారన్న వార్తలే ఇందుకు కారణం. మరోవైపు పశ్చిమ బెంగాల్‌పై తృణమూల్ కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుని మంచి స్థానాలను పొందింది.

మరోవైపు పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కు అధికారాన్ని అందించిన ప్రశాంత్‌తో సంప్రదింపులు జరిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీకే.. మమతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం.