బెంగళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి సంజన గల్రానీకి బెయిల్ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారంనాడు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత నెలలో ఆమెకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆరోగ్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఆమెకు బెయిల్ చేసింది. 

బెయిల్ మంజూరుకు సెంబంధించిన ఉత్తర్వులను ఈ రోజే జైలు అధికారులకు పంపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సంజన ఈ రోజు లేదా రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, ప్రతి నెల రెండుసార్లు విచారణకు హాజరు కావాలని, డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు సంజనను ఆదేశించింది. ఈ కేసులో సాక్ష్యాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించరాదని కూడా ఆదేశించింది. 

పార్టీల్లో డ్రగ్స్ వినియోగం, విక్రయం కేసులో సినీ తరాలు రాణిని, సంజనను, తదితరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్ర్ కేసులో సెప్టెంబర్ లో బెంగుళూరు సీసీబీ ఇరువురు తారలను విచారించింది. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసారు. గత నెలలో రాగిణి, సంజనలతో పాటు ఇతర నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. 

అయితే ఆరోగ్యపరమైన సమస్యలను చూపిస్తూ తాజాగా సంజన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.