ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  భూపేష్ బఘేల్ తన రాజకీయ సలహాదారుడిగా వివాదాస్పద జర్నలిస్ట్ వినోద్ వర్మను నియమించారు. గత ఏడాది రాష్ట్రంలో కలకలం రేపిన సెక్స్ సీడీ కేసులో వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది.

అశ్లీల సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారంటూ బీజేపీ నేత ప్రకాశ్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో వినోద్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన అదే ఏడాది డిసెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు.

మరోవైపు ముఖ్యమంత్రికి వర్మతో సహా నలుగురు సలహాదారులను నియమిస్తూ ఛత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ జర్నలిస్ట్ రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా, ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేశ్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొంది.