ఉన్నావ్ లో మరో రేప్: రక్తమోడుతున్న బాలికపై పోలీస్ నీతి ఇదీ...

9-Year-Old Girl Allegedly Raped In UP's Unnao
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

ఉన్నావ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై పాతికేళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. దాంతో బాలిక రక్తమోడుతూ తీవ్రమైన నొప్పితో బాధపడింది. ఈ సంఘటన బుధవారంనాడు జరిగింది. 

ఆ బాలిక బాధ దాంతో ముగిసిపోలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాలిక ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్ కు తిరగాల్సి వచ్చింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికను పోలీసులు గంటల తరబడి నిలబెట్టారు. ఆ తర్వాత మరో పోలీసు స్టేషన్ కు వెళ్లాలని సూచించారు. 

బాధితురాలి కుటుంబ సభ్యులు తమ గ్రామం నుంచి గంగానదిలో పవిత్ర స్నానం చేయడానికి ట్రాక్టర్ లో పలు కిలోమీటర్లు ప్రయాణించారు. ఉదయం పూట స్నానాలు చేసి, ఓ ప్రదర్శనకు వెళ్లారు. అక్కడి రద్దీని అవకాశంగా తీసుకని ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు ఛోటు బాలికను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. 

రద్దీగా ఉండడంతో బాలిక కేకలు ఎవరికీ వినిపించలేదు. నిందితుడి పారిపోయిన తర్వాత అతి కష్టం మీద బాలిక తన కుటుంబ సభ్యులను కలుసుకోగలిగింది. బాలిక దుస్తులన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఛోటు తన కూతురిని ప్రదర్శనకు తీసుకుని వెళ్లి పొదల మాటుకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఆరోపించింది. 

బాలికను సమీపంలోని ఔరాస్ పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లి తమ గోడును వినాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. కొన్ని గంటల పాటు వేచి చూసిన తర్వాత సఫీపూర్ పోలీసు స్టేషన్ కు వెళ్లాలని సూచించారు. సంఘటన సఫీపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందని, అందుకని అక్కడికి వెళ్లాలని చెప్పారు. 

నిజానికి, చట్ట ప్రకారం పరిధితో సంబంధం లేకుండా పోలీసులు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత సంబంధిత పోలీసు స్టేషన్ కు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఆ పని చేయలేదు. 

బాలిక కుటుంబ సభ్యుల కష్టం చూసిన ఎవరో ఒకరు దాన్ని వాట్సప్ లో పెట్టి సర్క్యులేట్ చేయడంతో కనీసం ఆ కుటుంబ సభ్యులు సఫీపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. సఫీపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

loader