గురువు పట్ల చూపిన వినయ విధేయతలతో పాటు చదువులో క్రమశిక్షణలే ఓ చిన్నారిని బలితీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఫైజల్ ఇస్లామ్ అనే వ్యక్తి చదువుకుంటూనే చిన్నారులకు ట్యూషన్లు చెప్పేవాడు.

ఈ క్రమంలో అతని వద్దకు వచ్చే చిన్నారి అతని పట్ల వినయ, విధేయతలు చూపడంతో పాటు బాగా చదివేది. దీంతో ఆమెపై ఫైజల్‌లోని మృగాడు మేల్కొన్నాడు. ఈ నెల 21వ తేదీన పిల్లలందర్ని ఇంటికి పంపేసిన తర్వాత బాలికను అతడి మామ ఇంటికి తీసుకెళ్లాడు.

ఇదే సమయంలో అతని మామ సైతం కుటుంబసభ్యులతో పాటు రాజస్థాన్‌ వెళ్లడంతో చిన్నారిపై లైంగికదాడికి దిగాడు. దీంతో భయపడిపోయిన అతను బాలికను గొంతునులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పరుపులో చుట్టి ముసీదు బయట పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

బాలిక ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇస్లామ్ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూశారు. అయితే అతని ఇంటి పక్కవారు బాలిక ఇస్లామ్‌తో వెళ్లటం చూశామని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అనంతరం మసీదు బయట చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.