తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్ధినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విల్లుపురం జిల్లా మరక్కాణం గూనిమేడు గ్రామానికి చెందిన మోనిషా రెండో సారి నీట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

గతేడాది పరీక్ష రాసినప్పటికీ అర్హత సాధించలేదు. రెండు సార్లు ఎంతో కష్టపడి రాసినప్పటికీ అర్హత సాధించలేకపోవడంతో మోనిషా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చేపలు పట్టుకుంటూ జీవనం గడిపే మోనిషా కుటుంబంలో తల్లి కూడా ఇటీవలే మరణించడం విచారకరం. కాగా.. నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంగా బుధవారం ఇద్దరు విద్యార్ధునులు బలవన్మరణానికి పాల్పడటంతో మరణించిన విద్యార్ధినుల సంఖ్య మూడుకు చేరింది.

తిరుప్పూర్‌కు చెందిన అనిత, పట్టుకొట్టాయ్ జిల్లాకు చెందిన ఎన్.వైశ్య కూడా నీట్‌లో ఫెయిల్ అయ్యామన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు 2017లో ఆరియాలూర్ జిల్లాకు చెందిన అనిత ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచనలం కలిగించింది. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.