గోరఖ్ పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ లో గల హోటల్ గదిలో ఇద్దరు గుర్తు తెలియని పోలీసులు 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్ గదిలో ఈ సంఘటన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనపై కేసు శుక్రవారం కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో ఇప్పటి వరకు ఏ విధమైన అరెస్టులు జరగలేదు. గోరఖ్ పూర్ పోలీసు స్టేషన్ లోని సిబ్బంది అంతటినీ సస్పెండ్ చేయాలని, సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెసు, సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ, పూర్వాంచల్ సేన వంటి రాజకీయ పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి.

జిల్లా ఆస్పత్రిలో యువతికి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా హోటల్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, గార్డ్ వాంగ్మూలం కూడా తీసుకున్నామని గోరఖ్ పూర్ ఎస్ఎస్పీ సునీల్ కుమార్ గుప్తా చెప్పారు. తన ఇష్టప్రకారమే యువతి హోటల్ కు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయినా నిందితులను వదిలేది లేదని ఆయన చెప్పారు. 

పోలీసులు తనను కొట్టి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారని యువతి మీడియాతో చెప్పింది. తనను వదిలేయాలని కోరానని, కానీ వారు వినకుండా తనను కోట్టారని, తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. తనపై అఘాయిత్యం జరిగిన హోటల్ గదిని, తనపై అత్యాచారం చేసిన పోలీసులను తాను గుర్తు పట్టగలనని ఆమె చెప్పింది. తన తండ్రి కార్మికుడని, తాను ఇంటి వద్ద కోచింగ్ క్లాస్ లు చెబుతానని ఆమె చెప్పింది.