ఎన్నికల్లో ప్రత్యర్ధిని పోటీ నుంచి తప్పించడానికి కొందరు వ్యక్తులు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తారు. నయానో, భయానో ఎలాగోలా పోటీ నుంచి విరమింపజేసి ఎన్నికల్లో గెలుస్తారు.

ఇందుకు సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఎన్నో వార్తలు మనకు తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ప్రత్యర్ధులు దారుణానికి తెగబడ్డారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఓ వ్యక్తిని పోటీ చేయకుండా ఉండేందుకు గాను అతని కుమార్తెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తొలుత బాధితురాలిని కిడ్నాప్‌ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బరాబంకీ  జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు తొలుత పలుమార్లు ప్రత్యర్థులు తనపై ఒత్తిళ్లు తెచ్చారని, డబ్బునూ ఆశ చూపారని ఆయన పేర్కొన్నారు. తాను వీటికి లొంగకపోవడంతో పాఠశాల నుంచి తిరిగొస్తున్న తన కూతురిని ప్రత్యర్థులు (ఆకాశ్‌ వర్మ, లాల్‌జీ వర్మ, సచిన్‌ వర్మ, శివమ్‌ వర్మ) అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.