లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. ఆ తర్వాత శవాన్ని చెట్టుకు వేలాడదీశారు. 

లక్నోకు 230 కిలోమీటర్ల దూరంలో గల మహోబాలో ఆ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న బాలిక గతవారం శనివారంనాడు సరుకుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. మర్నాడు ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. 

ఆ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తమ ప్రాంతంలోనే ఉంటున్న యువకులు బాలికను వేధిస్తూ వస్తున్నారని, వారే అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.

బలవంతంగా తమ కూతురిని లాక్కెళ్లారని, వారు తమ కూతురిని చెట్టుకు వేలాడదీసి చంపారని తల్లి అంటోంది. భూరా, తరుణ్, భూపేంద్ర ఆ పనిచేసినట్లు తల్లి ఎన్డీటీవీతో చెప్పింది.