ఒడిశాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన లాక్‌డౌన్ సమయంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నారు.

వీరి కుటుంబసభ్యులు ఇక్కడికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆమె తల్లి విధుల్లో ఉండగా.. ఆమెతో పాటు పపనిచేసే ఉద్యోగులు ఇంటికి వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వారితో పాటు ఓ పోలీస్ అధికారి, ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, బాలికకు పరిచయమున్న మరో ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె మౌనం వహించింది.

అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక తన తల్లికి ఈ ఘోరాన్ని వివరించింది. దీంతో ఆమె తన సహచర ఉద్యోగులను ప్రశ్నించింది. వారు ఆమెను కూడా చంపేస్తామని బెదిరించడంతో  పాపను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది.

తిరిగి ఆగస్టులో భువనేశ్వర్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.