పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగా మంగళవారం 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వీరి మృతితో ఇప్పటి వరకు ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13కి చేరింది.


మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలకు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

ఇప్పటికే అదనపు బలగాలను రంగంలోకి దించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో దాదాపు 6వేల మంది పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయివు సైతం ప్రయోగిస్తున్నారు.

Also Read సీఏఏ ఆందోళనలు: రగులుతున్న ఢిల్లీ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు...

అదేవిధంగా హింసాత్మక ఘటనల కారణంగా బుధవారం కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ లో ప్రకటించారు. 

‘ అల్లర్లు ప్రభావితమైన ఈశాన్య ఢిల్లీలో రేపు పాఠశాలలు మూసివేస్తున్నాం. అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. బోర్డు పరీక్షలు వాయిదా వేయమని సీబీఎస్ఈని కోరాం’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన విన్నప్పం మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు సీబీఎస్ఈ ప్రతినిధులు చెప్పారు.