నయారాయపూర్: ఛత్తీస్ గఢ్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి మిత్రులను ఇద్దరిని తరిమికొట్టి వారిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

బలోదాబజార్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ బాలికలు నివసిస్తున్నారు. వారిద్దరిలో ఒకరి వయస్సు 16 ఏళ్లు కాగా, మరొకరి వయస్సు 14 ఏళ్లు. మార్చి 31వ తేదీన వారిద్దరు తమ మిత్రులతో కలిసి ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో దాదాపు 8 మంది యువకులు వారిపై దాడి చేసి మిగతా వారందరినీ బెదిరించి తరిమేశారు. 

ఆ తర్వాత అక్కాచెల్లెళ్లిద్దరినీ ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా ఈ విషయం చెప్తే చంపేస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా జరిగిన సంఘటనపై మౌనంగా ఉండిపోయారు. అయితే, రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఓ బాధితురాలు మహిళాశశి సంక్షేమ అభివృద్ధి శాఖను ఆశ్రయించింది. 

తనపై రెండు నెలల క్రితం కొంత మంది అత్యాచారం చేశారని, తనతో పాటు తన సోదరిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. యువకుల్లో ఒకతన ుతనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలను బయటపెడుతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. 

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో బాలికల మిత్రులు ఇద్దరు కూడా ఉన్నారు.