జర్నలిస్టు హోదా నుంచి రాజకీయ నాయకుడిగా మారిన మాజీ మంత్రి ఎంజే అక్బర్ పై మరో జర్నలిస్టు మీటూ ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఆయనపై పలువురు జర్నలిస్టులు మీటూ ఆరోపణలు చేయగా.. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ఆయనను పదివి నుంచి తొలగించాల్సి వచ్చింది. కాగా.. తాజాగా మరో మహిళా జర్నలిస్టు.. ఎంజే అక్బర్ కారణంగా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది.

అమెరికాలో సెటిల్ అయిన మహిళా జర్నలిస్టు పల్లవి గొగొయ్... ఎంజే అక్బర్ తనను లైంగికంగా ఎలా వేధించాడో.. వాషింగ్ టన్ పోస్ట్ కి కథనంగా రాసింది. 1990ల సమయంలో.. పల్లవి.. ఎంజే అక్బర్ వద్ద పనిచేసింది. అప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఒకసారి నేను రాసిన కథనాన్ని మెచ్చుకునే క్రమంలో.. బలవంతంగా నాకు ముద్దుపెట్టాడు. ఆ సంఘటనకు నేను షాకయ్యాను.’’ అని చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనే ముంబయిలో చోటుచేసుకుందని తెలిపింది. ‘‘ అతను నాకు దగ్గరగా వచ్చి బలవంతంగా ముద్దుపెట్టాడు. నేను వెంటనే అతనిని వెనక్కి నెట్టేశాను’’ అని ఆమె తెలిపారు.

తాను చెప్పినట్లు వినకపోతే.. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తానని అక్బర్ బెదిరించేవాడని ఆమె ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. మరోసారి జయపురలో  స్టోరీ గురించి చర్చించాలని హోటల్ గదికి పిలిచి... బలవంతంగా తన ఒంటిపై డ్రస్ తొలగించి అత్యాచారం చేశాడని ఆమె వివరించారు. అతని నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నించానని, కాకపోతే అతని శారీరక బలం ముందు ఓడిపోయినట్లు ఆమె తెలిపారు.  ఈవిషయం గురించి అప్పట్లో తాను ఎవరికీ చెప్పలేకపోయానని ఆమె అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నప్పటికీ.. తన పరువు పోతుందని భావించి వెనక్కి తగ్గినట్లు తెలిపారు.

ప్రస్తుతం మీటూ ఉద్యమం కారణంగా బాధిత మహిళలు అందరూ ఒక్కొక్కరుగా వారు  ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్న తరుణంలో తాను ఈ విషాయన్ని బయటపెట్టినట్లు చెప్పారు.  తనలానే మరికొందరు కూడా తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టాలని ఆమె ఈ సందర్భంగా కోరుకున్నారు. 
కాగా.. పల్లవి గోగోయ్ చేసిన ఆరోపణలను ఎంజే అక్బర్ పర్సనల్ న్యాయవాది ఖండించారు.