సునీల్ ‘కనబడుటలేదు’ రివ్యూ!
సునీల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `కనబడుటలేదు`. ఓ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎమ్. బాలరాజు దర్శకత్వం వహించాడు.
డిటెక్టివ్ సినిమాలు మన దగ్గర రావడం అరుదు.. వచ్చినా కూడా వాటిని కామెడీ యాంగిల్ లో కానీ లేదంటే కమర్షియల్ సినిమాలుగా కానీ తెరకెక్కిస్తుంటాం. కానీ సీరియస్ డిటెక్టివ్ లు అసలు రావు. ఎప్పుడో డిటెక్టివ్ వంటి తమిళ సినిమాలు వస్తే చూసి ఆనందపడటమే.ఈ నేఫధ్యంలో కనిపడకుండా పోయిన ఓ వ్యక్తి కేసుని డీల్ చేసే డిటెక్టివ్ కథతో వచ్చిన సినిమా అంటే ఆసక్తికరమే. అందులోనూ సునీల్ డిటెక్టివ్ గా చేసారంటే అది కన్నడ చిత్రం బెల్ బాటమ్ స్దాయిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాము. ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి రేపిన ఈ చిత్రం కథేంటి...ఇందులో విషయమేంటి..ఇలాంటి సినిమాలకు అవసమరైన స్క్రీన్ ప్లేతో మాయ జరిగిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
ఆదిత్య (యుగ్ రామ్) అనే కుర్రాడు, శిశిత (వైశాలి రాజ్) పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ శిశిత మాత్రం సూర్య (సుక్రాంత్ వీరల్లా) అనే మరో కుర్రాడుతో ప్రేమలో పెళ్లికు ముందు నుంచి ప్రేమలో ఉంటుంది. ఈలోగా సూర్య-శిశితల విషయం పెద్దవాళ్లకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. దాంతో వాళ్లిద్దరూ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. అప్పటి నుంచి సూర్య కనిపించకుండాపోతాడు. సూర్య కేసు డీల్ చేస్తున్న విక్టర్ రాజు అనే ఎస్సై కూడా కనిపించకుండాపోతాడు. ఆ కేసుని పోలీస్ లు డీల్ చేయలేకపోతారు. అప్పుడు డిటెక్టివ్ (సునీల్) దగ్గరకు ఆ కేసు వస్తుంది. ఆ డిటెక్టివ్ ఆ కేసుని ఎలా డీల్ చేసాడు అనేది అసలైన కథ.
ఎనాలసిస్ ..
మొదటే చెప్పుకున్నట్లు డిటెక్టివ్ సినిమాలు తెలుగులో బాగా తక్కువ. ఎందుకంటే సినిమా ఏ మాత్రం గిప్పింగ్ గా లేకపోయినా తేడా కొట్టేయటం ఖాయం. అందుకే మన డైరక్టర్స్ రిస్క్ తో కూడిన ఈ జానర్ కు వెళ్ళకుండా..కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేస్తూ సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆ విషయంలో దర్శకుడు బాలరాజు మాత్రం ఎక్కువ శాతం కొత్త నటులతో ఓ ప్రయోగం చేసారనే చెప్పాలి. సునీల్ తప్ప సినిమాలో ఎక్కువ శాతం పరిచయం లేని మొహాలే. తన తొలి చిత్రానికే ఓ డిటెక్టివ్ కథ ఎన్నుకోవటం అభినందించదగ్గ విషయమే. అయితే ఎన్ని అనుకున్నా ..ఎవరేం చేసినా సక్సెస్ అనేది అల్టిమేట్ గోల్. ఆ విషయంలో డైరక్టర్ తడబడ్డాడనే చెప్పాలి.
మొదటగా ఈ సినిమా పోస్టర్స్ పై సునీల్ ఫొటో వేసినప్పుడు ..సినిమా సునీల్ చుట్టూ తిరుగుతుందని భావిస్తాం. కానీ సెకండాఫ్ ప్రారంభానికి కానీ సునీల్ కనపడడు. అయితే కథ ప్రకారం..సునీల్ అక్కడే వచ్చాడనుకుందాం. కానీ సునీల్ ప్రధాన పాత్ర అయిన డిటెక్టివ్ అని పబ్లిసిటీలో చెప్పినప్పుడు అతను ఎప్పుడు తెరపై వస్తాడా అని ఎదురుచూడటం సహజం. అలా ఫస్టాఫ్ అంతా నిరీక్షణలో గడుస్తుంది. విసుగెత్తి మనకు సునీల్ ‘కనబడుటలేదు’అని పోస్టర్ వేయాలనిపిస్తుంది. ఈ క్రమంలో తెరపై జరుగుతున్న మిగతా కథ అంతా పట్టించుకోబుద్ది కాదు. దానికి తోడు ఫస్టాఫ్ సునీల్ కాకుండా ఉన్న మిగతా పాత్రల మధ్య పాటలు, ఫైట్స్. అవి ఇంకా విసిగిస్తాయి. పోనీలే డైరక్టర్ కథ అలా రాసుకున్నాడు అనుకుంటే సెంకడాఫ్ లో డిటిక్టివ్ గా సునీల్ రంగ ప్రవేశం దగ్గర నుంచి కథ పరుగెత్తాలి.
సునీల్ ఎక్కడికి కదలడు..ఓ గదిలోనే ఎక్కువ సేపు ఉంటాడు. క్లూలు పట్టుకుని ఇన్విస్టిగేట్ చేయడు. ఆ ఇన్విస్టిగేషన్ కు ఏ అడ్డులు రావు. క్లైమాక్స్ ముందు మాత్రం ఆ కేసులో ఉన్న ముడులు విప్పుతూ మొత్తం వివరణ ఇస్తాడు.అప్పుడు సునీల్ ఏం చేసినట్లు...అనిపిస్తుంది. ఇక ఇలాంటి సినిమాల్లో రెగ్యులర్ జరిగే తంతు కథని పక్కదోవ పట్టించే సన్నివేశాలు.అవే ఇలాంటి సినిమాల్ని ప్రమాదంలో నెట్టేస్తాయి. ఆ విషయం మర్చిపోయారు. ఫస్టాఫ్ పెద్దగా ఏమీ అనిపించదు. సెకండాఫ్ సునీల్ వచ్చాక ..కాస్త ధైర్యం వస్తుంది. ఆ భ్రమలు మెల్లిమెల్లిగా తొలిగిపోతాయి. కీలకమైన దశలో… కథనం గందరగోళంగా ఉంటుంది. ఫైనల్ ఈ బాధలు పడలేం అనుకున్నాడేమో ఏమో హత్యలెవరు చేశారన్న విషయాన్ని సునీల్ పాత్రతో చెప్పించేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ మాత్రం ఇంట్రస్టింగ్ దే. దాని ఎగ్జిక్యూషనే బ్యాడ్.
దర్శకత్వం,మిగతా విభాగాలు
కామెడీ పాత్రలు, హీరోగా సినిమాలు చేసీ చేసీ అలాంటి పాత్రల్లోనే దర్శన మిచ్చిన సునీల్ ని ఈసినిమాలో కొత్తగా చూసే అవకాశం దక్కింది. అతని బాడీ లాంగ్వేజ్ మరీ అంత డిఫరెంట్‌గా ఏం ఉండదు గానీ, డిటెక్టీవ్ పాత్ర ఏమో కానీ డిఫరెంట్ గా మాత్రం ఉంది. అందుకు కారణం సునీల్ నవ్వించకపోవటమేనేమో.కీ రోల్స్ చేసిన సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్,యుగ్ రామ్ లు బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే అనిపిస్తారు.
ఇది డైరక్టర్ సినిమా. కాస్తంత ఇబ్బంది, గందరగోళం ఉన్నా కొన్ని సీన్స్ లో తప్పకుండా ఆకట్టుకొంటాడు. అతని ప్రతిభ కనపడుతుంది. డైలాగులు కొన్ని బాగా పేలాయి. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కాని డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ డిటెక్టివ్ గా సునిల్‌ను పాత్రను పరిచయం చేయటం బాగుంది.కెమెరా వర్క్ ఓకే. కానీ ఇలాంటి సినిమాలు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం దారుణం. రాక్షసుడు సినిమా ని గుర్తు చేస్తూ హోరెత్తిపోయింది. పాటలు గొప్పగా లేవు. రన్ టైమ్ చాలా క్రిస్ప్ గా ఉండటం కలిసొచ్చింది.
ఫైనల్ థాట్
డిటక్టివ్ సినిమాలు అంటే మెదడుకు మేత పెడుతూ, ఉత్కంఠత కలిగింతే స్దాయిలో ఉండాలి అనే రూల్ ని ఈ సినిమా సమర్దవంతంగా బ్రేక్ చేసింది.
రేటింగ్:2
--సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
బ్యానర్స్: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్, హిమజ, యుగ్రం, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమా మహేశ్వర రావు, కిషోర్, శ్యామ్ మరియు మధు తదితరులు
సమర్పణ: సరయు తలసిల
సంగీతం: మధు పొన్నాస్
డిఒపి: సందీప్ బద్దుల
ఎడిటింగ్: రవితేజ కుర్మాన
రన్ టైమ్ :1గంట, 51నిముషాలు
రచన,దర్శకత్వం: బాలరాజు ఎం.
పిఆర్ఓ: వంశీ – శేఖర్.