సత్యదేవ్ ‘తిమ్మరుసు’ రివ్యూ
థియేటర్లు మొదలు అవ్వడంతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజు ఈ సినిమా వచ్చింది. కరోనా భయం ఇంకా జనాల్లో ఉంది.ఈ నేపధ్యంలో సినిమా బాగుంది, ఖచ్చితంగా చూడదగ్గది అంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
ఈ మధ్య తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ భాషలో క్రైమ్ థ్రిల్లర్స్ జోరు పెరిగింది. ఇంతకు ముందు లేనన్ని సినిమాలు వరస పెట్టి వచ్చేస్తున్నాయి. ఓ క్రైమ్..దాని ఇన్విస్టిగేషన్ ప్రధానంగా ఆ సినిమాలు రూపొందుతున్నాయి. మన తెలుగులోనూ రాక్షసుడు , అశ్వథ్థామ , ఆ తర్వాత హిట్, నాని వి సినిమా..ఇలా వరసగా క్రైమ్ ని వెండితెరపై ఆవిష్కరింపచేస్తున్నాయి. అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస వంటి కామిక్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు వచ్చాయి. ఆ వరసలో తాజాగా దిగిన మరో మరో మర్డర్ మిస్టరీ ఇన్విస్టిగేషన్ చిత్రం తిమ్మరసు. ఈ సినిమా ఎలా ఉంది. అసలు కథేంటి. ఈ క్రైమ్ ఇన్విస్టిగేషన్ లో మలుపులు అలరించాయా...సత్యదేవ్ కు ఈ సినిమా హిట్ ఇవ్వగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
క్యాబ్ డ్రైవర్ అరవింద్,పోలీస్ ఇన్ఫార్మర్ కూడా. అతనికి ఓ సోర్స్ ద్వారా వరస హత్యలు గురించిన వీడియో దొరుకుతుంది. అయితే ఈ విషయం ఆ మర్డర్స్ చేసే వ్యక్తికి తెలిసిపోయి...అతన్ని చంపేస్తారు. అంతేకాకుండా ఆ మర్డర్ కేసులో బారులో పనిచేసే అమాయికుడు ని ఇరికిస్తారు. అందుకు భూపతి రాజు (అజయ్) అనే కరప్ట్ పోలీస్ ఆఫీసర్ సహకరిస్తాడు. ఎనిమిదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఆ కేసుని రీ ఓపెన్ చేసి అతన్ని నిర్దోషి గా ప్రూవ్ చేయాలనుకుంటాడు లాయర్ రామ్ చంద్ర (సత్యదేవ్). అతను ఇందులో అసలు హంతకులు ఎవరో తెలిస్తే కానీ ఈ క్లోజ్ అయ్యిపోయిన కేసుని ఓపెన్ చేయలేమని, సాక్ష్యాధారాలు కోసం ప్రయత్నం మొదలెడతాడు. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు పడతాడు. అనేక నిజాలు బయిటకు వస్తాయి. ఫైనల్ గా అసలు హంతకుడుని ట్రాప్ చేసి పట్టుకుంటాడు. అతను ఎవరు..ఎందుకు ఈ హత్య చేసాడు. లాయిర్ తన మొదటి కేసుగా ఇంత క్లిష్టమైన దాన్ని ఎందుకు ఎంచుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఇది క్రైమ్ ఇన్విస్టిగేషన్ డ్రామా. అయితే రెగ్యులర్ గా అది పోలీస్ ల వైపు నుంచి జరుగుతున్నట్లు గా సినిమాలు వస్తూంటాయి. ఈ సారి పోలీస్ కాకుండా లాయిర్ ఇన్విస్టిగేట్ చేస్తూంటాడు. అలాగే రెగ్యులర్ గా మన మర్డర్ మిస్టరీలులో..ఓ హత్య..కొంతమంది అనుమానితులు, చివర్లో వాళ్లలో ఒకరు లేదా, ఓ ఊహించని ట్విస్ట్ తో ముగుస్తాయి. ఈ సినిమా కూడా అలాంటిదే అయినా ఇన్విస్టిగేట్ చేసే విధానం,ఎప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అసలు మర్డర్ ఎవరు చేసారు..ఎందుకు చేసారు అనేది చివరి దాకా సస్టైన్ చేయగలిగారు. అయితే ఇన్విస్టిగేషన్ లో కొత్తదనం ఉందేమో కానీ, సెంటర్ స్టోరీ లైన్ మాత్రం చాలా సార్లు చూసినదే. అలాగే ఈ సినిమా చూస్తూంటే ఆర్థర్ కానన్ డయల్ క్రియేట్ చేసిన షెర్లాక్ హోమ్స్ ఖచ్చితంగా గుర్తువస్తాడు. ఇప్పటికే షెర్లాక్ మీద ఎన్నో సినిమాలు , టీవీ సీరియల్స్ వచ్చాయి. ప్రపంచంలోని అన్ని భాషల్లో వచ్చిన క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు,కథలకి షెర్లాక్ హోమ్స్ ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రేరణతో సినిమా రూపొందించారు అనుకుంటాము కానీ ఇది 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్. అలాగే ఈ కన్నడ సినిమా 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” కి ఫ్రీమేక్.
ఈ కథలో ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే...మనం ఎక్సపెక్ట్ చేసింది జరగకపోవటం. ఫస్టాఫ్ సెటప్ ఎంతో టైట్ గా ఉంటుంది. సెకండాఫ్ లో అసలు కథలోకి పూర్తిగా వెళ్లేటప్పుడు మాత్రం అదే మ్యాటరాఫ్ ఇంట్రస్ట్ ని సస్టైన్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లేని టైట్‌గానే రాసుకున్నారు కానీ..అంతే ఇంట్రస్ట్ గా చెప్పలేకపోయారనిపిస్తుంది. అయితే షెర్లాక్ హోమ్స్ తరహాలో తెలివితో క్రైమ్ ని పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే సీన్స్ మాత్రం బాగున్నాయి. అలాగే ఇన్విస్టిగేషన్ లో టెక్నాలిజీని బాగా వాడుకున్నారు. కానీ ఎమోషన్స్ కు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. క్లైమాక్స్ల్ లో హీరో ఆ మర్డర్స్ ని రిస్క్ తీసుకుని మరీ ఎందుకు ఇన్విస్టిగేట్ చేస్తున్నాడు అనే విషయం రివీల్ అయ్యినప్పుడు ఓ రేంజిలో రెస్పాన్స్ రావాలి. కన్నడంలో అదే జరిగింది. కానీ తెలుగులో ఆ స్దాయిలో పండలేదు. అలాగే లాస్ట్ లో అసలు క్రైమ్ జరగటానికి చెప్పే కారణం పెద్దగా ఉండదు.
దర్శకత్వం..మిగతా విభాగాలు
ఓ సక్సెస్ ఫుల్ చిత్రం రీమేక్ చేసినప్పుడు దర్శకుడు ఎంతగొప్పగా సినిమా తీసినా ఆ మేరకు మార్క్ లు అతని ఎక్కౌంట్ లో పడవు. అయితే ఇలాంటి క్రైమ్ ఇన్విస్టిగేషన్ డ్రామాని రీమేక్ చేయటమూ కష్టమే. కన్నడంకు తెలుగుకు ఇంప్రవైజేషన్ సీన్స్ బాగున్నాయి. అలాగే కథ సీరియస్ గా నడుస్తున్నప్పుడు బ్రహ్మాజీ పాత్ర ద్వారా ఫన్ పండించే ప్రయత్నం చేసారు. అదీ బాగుంది.
టెక్నికల్ గా ..ఇలాంటి సినిమాలకు అవసరమైన ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగా కుదరాయి. అలాగే పాటలు లేకపోవటం కూడా కలిసొచ్చింది. లేకపోతే అవి పంటిక్రింద రాళ్లగా మారేవి. మిగతా డిపార్టమెంట్స్ కూడా బాగున్నాయి. నిర్మాణాత్మక విలువలు ఈ సినిమాకు సరిపోయాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.
నటుడుగా సత్యదేవ్ ఎప్పుడు వంక పెట్టనివ్వడు. ఈ సారి అద్భుతంగా నటించాడు. సరైన కథ పడితే సినిమాని మొత్తం భుజాల మీద మోయగలడనిపించుకున్నాడు. అసెస్టింగ్ బ్రహ్మాజీ బాగా చేసారు. హీరోయిన్ ప్రియాంక మాత్రం కష్టం అనిపించింది. అయితే రొమాంటిక్ సీన్స్ లేవు కాబట్టి ఇబ్బంది లేదు.
ఫైనల్ థాట్
కన్నడ సినిమా చూడనివాళ్లు ఈ సినిమాని ట్రై చేయచ్చు. చూసిన వాళ్లు కూడా ఏమేం మార్పులు చేసారో అని ఒరిజనల్ తో పోల్చుకోవచ్చు. అదీ రకం ఇన్విస్టిగేషనే
RATING 2.75/5
--సూర్య ప్రకాష్ జోస్యుల