Asianet News TeluguAsianet News Telugu

Senapathi:రాజేంద్రప్రసాద్ 'సేనాపతి' రివ్యూ

 అనేక సవాళ్లను దాటుకొని చివరకు వచ్చింది 2021 సంవత్సరం. ఇక ఈ ఏడాదిలో చివరి రోజైన శుక్రవారం రిలీజైంది ఈ చిత్రం. రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.

Rajendra Prasad's Senapathi Movie Review
Author
Hyderabad, First Published Dec 31, 2021, 2:45 PM IST

పెద్ద తెరపై సినిమాలు గత కొంతకాలంగా అలరిస్తున్న సమయంలో ఓటీటి సినిమాలకు క్రేజ్ తగ్గింది. ఓటీటి లో రిలీజైంది అంటే థియోటర్ లో రిలీజ్ కాలేని సినిమా లేదా ఓటీటి కోసమే తీసిన సినిమా అన్నది ప్రేక్షకులలో ముద్ర పడి పోయింది. ఈ క్రమంలో ఈ చిన్న సినిమా ఓటీటి రిలీజ్ పెట్టుకున్నా..ట్రైలర్, టీజర్స్ తో  మంచి బజ్ తెచ్చుకుంది. ఏదో కొత్తదనం ఉన్న సినిమా అనే ఆలోచన క్రియేట్ చేసింది. సినిమా చూడాలన్న ఉత్సాహం కలగచేసింది. ఇంతకీ ఈ సినిమా ఆ ఉత్సాహాన్ని ,ఉద్వేగాన్ని కంటిన్యూ చేసిందా...కథేంటి, వర్కవుట్ అయ్యే కాన్సెప్టు యేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

అనాధ అయిన  కృష్ణ (నరేశ్‌ అగస్త్య) తను చేయని తప్పుకు ఫ్రేమ్ చేయబడి జువైనల్ హోమ్‌ కు పంపడతడా. అక్కడే ఓ వార్డెన్ (చిన్ని కృష్ణ) ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుకుని పోలీస్ అవుతాడు. ఐపీఎస్ అవ్వాలని ప్రీపేర్ అవుతూంటాడు. ఈ లోగా ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా  ఓ క్రిమినెల్ ని వెంటాడుతూ..అనుకోని విధంగా తన సర్వీస్ రివాల్వర్ ని పోగొట్టుకుంటాడు. ఆ రివాల్వర్  కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్‌) చేతికి వస్తుంది. దాన్ని కృష్ణమూర్తి ఏ క్రిమినల్ కార్యక్రమాలకు వాడాడు...అలాగే గన్ మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ఏం జరిగింది వంటి విషయాలు చుట్టు అల్లబడ్డ క్రైమ్ థ్రిల్లర్ ఈ చిత్రం.
  
ఎలా ఉంది..


తమిళ సినిమా '8 తొట్టక్కల్' (8 తూటాలు) రీమేక్ గా వచ్చిందీ ఈ చిత్రం. ఈ తమిళ సినిమాకు మూలం  1949 వచ్చిన జపనీస్ చిత్రం Stray Dog,అలాగే ఈ సినిమా 2018 లో 8MM Bullet గానూ రీమేక్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో వచ్చిన ఈ చిత్రంలో ఒరిజనల్ లో ఉన్న బెస్ట్ ఎలిమెంట్స్ ని,కథను తీసుకుని మార్పులు చేసుకుంటూ వెళ్లారు. ఓ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని రూపొందించాలని దర్శకుడు పడ్డ తపన ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపిస్తుంది.  Tension is everything ఇదే సూత్రం పెట్టుకుని తమిళ సినిమాను తెలుగుకు మార్చుకుంటూ వెళ్లారు దర్శకుడు. అయితే సేనాపతి అని టైటిల్ పెట్టి రాజేంద్రప్రసాద్ ని  లీడ్ రోల్ లో తీసుకున్నప్పుడు ...కథని అటు వైపు నుంచి చెప్పుకుంటూ వస్తే బాగుండేది...అలా చెయ్యకండా ఓ పోలీస్...తుపాకి పోగొట్టుకున్న కథగా మొదలెట్టి...ఒక్కసారిగా యుటర్న్ తీసుకున్నారు. దాంతో అప్పటిదాకా జరిగిన కథ అంతా మర్చిపోయి...రాజేంద్రప్రసాద్ ని ఫాలో అవుతాం. దాంతో ఫస్టాఫ్ రేసీగా జరిగినట్లు సెకండాఫ్ ...స్లో అయ్యిపోయినట్లు అనిపించింది. హీరో ఎవరు..అతని ప్రపంచం ఏమిటి అన్న దానికే ఎక్కువ టైమ్ తీసేసుకున్నారు. అయితే చివరిదాకా  Make the stakes highఅన్నట్లుగా సాగటం కలిసొచ్చింది. 

ఇక ఈ స్క్రీన్ ప్లేలో క్రూసియల్ పార్ట్ ఏమిటి అంటే ఎమోషన్. క్రైమ్ జానర్ లో మిక్స్ అయ్యే ఎమోషన్ ని ఎంచుకున్నారు. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే ఇలాంటి కథలకు కొద్దిగా మిస్టరీ కూడా కలిస్తే మరింత థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే మొదట్లో ఏర్పడ్డ టెన్షనే చివరివరకూ లీడ్ చేయాల్సి వచ్చింది. కథకు సరిపడనంత లేదనిపించింది. ఇంతకు మించి వివరిస్తే ఈ థ్రిల్లర్ స్టోరీ ని రివీల్ చేసేసినట్లు ఉంటుంది. ఏదైమైనా క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో హ్యూమన్ రిలేషన్స్ ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. గన్ ని అడ్డం పెట్టి రెండు పాత్రలు, రెండు జీవితాలను సమాంతరంగా చూపుకుంటూ వెళ్లాడు.  అయితే ఫన్ కు అవకాసం ఎలాగో లేదు. లవ్ స్టోరీ ఉన్నా అది ఇంట్రస్టింగ్ గా అనిపించలేదు. కథలో టెన్షన్ ఎలిమెంట్ రొమాన్స్ ని మింగేసింది.  అయితేనేం డైరక్టర్ తన టెక్నికల్ బ్రిలియన్స్ తో కథాలోపాలను కప్పిపుచ్చాడు. కథను చాలా చోట్ల కదం తొక్కించాడు. సినిమాలో బూతులు తగ్గిస్తే కాస్త ఫ్యామిలీలతో కూర్చుని చూసే అవకాసం ఈ సినిమా ఇచ్చేది. అదే ఈ సినిమాలో పెద్ద మైనస్. బూతులతో సహజత్వం రాదు. ఏవగింపు వస్తుంది. ఆ ఒక్క విషయం వదిలేస్తే ఈ సినిమా ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళేది.

టెక్నికల్ గా...

ఈ సినిమా విషయానికి వస్తే టెక్నికల్ గా అన్ని క్రాప్ట్ ల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. ఆర్టిస్ట్ ల పరంగా చిన్న సినిమాగా అనిపించే ఈ సినిమాకు టెక్నికల్ సపోర్టే నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా వివేక్ కాలెపు సినిమాటోగ్రఫి ఈ సినిమా మెయిన్ హైలెట్. డైలాగ్స్ ఓకే అనిపించాయి.  గౌతమ్ నెరుసు ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ లో ఉన్న స్పీడుని సెకండాఫ్ లో తేలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో కొన్ని సీన్స్ కు బాగా ప్లస్ అయ్యింది. డైరక్టర్ ప్రతీ ఆర్టిస్ట్ నుంచి మంచి నటనను తీసుకుని, గ్రిప్పింగ్ గా ఉండేలా  సీన్స్ డిజైన్ చేసారు. యాక్షన్ సీన్స్ ...పెద్ద హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ తెచ్చాయి. ముఖ్యంగా సినిమాకు సహజత్వం కనపడేలా  సెట్స్, ఆర్టిస్ట్ ల లుక్, డైలాగు డెలవరీ,కెమెరా యాంగిల్స్ ,లైటింగ్,ఫ్రేమింగ్  ఇలా ఒకటేమిటి  ప్రతీ విషయంలోనూ  దర్శకుడు పవన్ సాదినేని కష్టం మనకు కనపడుతుంది. గ్రే షేడ్స్ ని పాత్రల యాంగిల్ లోనుంచి మనకు కొత్తగా అనిపించేలా చూపించారు.

నటీనటుల్లో...

హర్షవర్ధన్ , రాకేందు మౌళి ఇద్దరిని కొత్తగా ప్రజెంట్ చేసారు. జ్ఞానేశ్వరి, సత్య ప్రకాష్, జోష్ రవి వంటి ఆర్టిస్ట్ లు గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు.  రాజేంద్రప్రసాద్ అయితే చాలా కాలం తర్వాత తన కామెడీ టైమింగ్ ప్రక్కన పెట్టి తనలోని నటుడుని నిద్రలేపారు. నరేష్ అగస్త్య మంచి ఆర్టిస్ట్. హీరోగా చెప్పలేం కానీ తెలుగులో నటన వచ్చిన కో ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతారనిపిస్తోంది.

ఫైనల్ థాట్

  కంటెంట్ ఓటీటిదే అయినా మేకింగ్,టేకింగ్  మాత్రం పెద్ద తెరదే
---సూర్య ప్రకాష్ జోశ్యుల

రేటింగ్: 2.5/5

ఎవరెవరు...


నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల‌, హర్షవర్ధన్, రాకేందు మౌళి, 'జోష్' రవి, సత్యప్రకాష్, పావని రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు 
ఎడిటర్: గౌతమ్ నెరుసు
ఒరిజినల్ స్టోరి: శ్రీ గణేష్ 
మాటలు: రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు 
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
నిర్మాతలు: విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ: 31-12-2021 
 ఓటీటీ: ఆహా 

 

Follow Us:
Download App:
  • android
  • ios