Asianet News TeluguAsianet News Telugu

`మట్టి కథ` మూవీ రివ్యూ, రేటింగ్‌

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా `మట్టికథ`. అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే తొమ్మిది అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. మరి శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

matti katha movie review rating arj
Author
First Published Sep 22, 2023, 8:23 AM IST

తెలంగాణ నేపథ్యంలో ఇటీవల సినిమా జోరు సాగుతుంది. తెలంగాణ కల్చర్‌ని రూట్ లెవల్‌లో ఆవిష్కరిస్తున్న సినిమాలు వస్తున్నాయి, అందులో కొన్ని మాత్రమే ఆదరణ పొందుతున్నాయి. కొన్ని డిజప్పాయింట్ చేస్తున్నాయి. `మట్టి కథ` కూడా ఆ కోవకి చెందిన మూవీనే. పవన్‌ కడియాలా దర్శకత్వం వహించిన ఈ మూవీని మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది(సెప్టెంబర్‌ 22). ఇప్పటికే ఇది పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. తొమ్మిది అవార్డులను సాధించింది. దీంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి అవార్డులు వచ్చేంత మ్యాటర్‌ సినిమాలో ఏముంది? మన ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథః 
హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారం అనే పల్లెటూరులో 2003లో జరిగే కథ ఇది. భూమయ్య (అజయ్‌ వేద్‌), శ్రీను(అక్షయ్‌ సాయి), యాదగిరి(రాజు ఆలూరి) స్నేహితులు. దూరాన ఉన్న కాలేజ్‌లో చదువుకుంటారు. ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు. భూమయ్య నాన్న వ్యవసాయం చేస్తూ బతుకీడుస్తుంటారు. రాజాకార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూమిని వదల్లేదు. భూమినే నమ్ముకుంటారు. అయితే శేఖర్‌(బల్వీర్‌ సింగ్‌) హైదరాబాద్‌కి వెళ్లి కంప్యూటర్‌ జాబ్‌ చేస్తుండటంతో భూమయ్యకి కూడా అలా హైదరాబాద్‌కి పోవాలనిపిస్తుంటుంది. భూమిని అమ్మి వెళ్లిపోదామని ఇంట్లో ఒత్తిడి తెస్తుంటారు. కానీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో అహిష్టంగానే చదువుతుంటారు. ఊర్లో ఉండే పటేల్‌ కూతురు రాణి(మాయ)ని ప్రేమిస్తుంటాడు. మరోవైపు ఇంటర్ లో ఫైనల్‌ ఎగ్జామ్స్ వస్తాయి. చదువలేక పేపర్‌ లీక్‌ చేసి కాపీ కొడతారు, కానీ దొరికిపోతారు. దీంతో పోలీస్‌ కేసు అవుతుంది. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డారు? సర్పంచ్‌తో కలిసి పటేల్‌ చేస్తున్న కుట్రలేంటి? భూమినే నమ్ముకున్న భూమయ్య తండ్రి తన భూమిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

విశ్లేషణః 

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. తెలంగాణ యాస ఇప్పుడు సక్సెస్‌ ఫార్ములాగా మారింది. అదే సమయంలో బలమైన కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు మాత్రమే ఆదరణ పొందుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ ని క్యాష్‌ చేసుకోవాలని చేసే మేకర్స్ కుయుక్తులు ఫలించడం లేదు. జెన్యూన్‌ అటెప్ట్ చేస్తే అంతో ఇంతో ఆదరణ ఉంటుందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ రూట్‌ లెవల్‌లో `బలగం` చిత్రం వచ్చింది. సంచలన విజయం సాధించింది. `దసరా` కూడా మరో యాంగిల్‌లో హిట్‌ అయ్యింది. అలానే రూట్‌ లెవల్‌లో మరో స్టయిల్‌ కథని ఆవిష్కరించింది `మట్టికథ`. 90 కిడ్స్ స్కూల్‌, కాలేజీ రోజులను తలపిస్తుంది. అప్పుడు పేరెంట్స్ పరిస్థితులను, ఇంట్లో ఉండే వాతావరణాన్ని, భూమిపై ఉన్న ప్రేమని, అప్పుడప్పుడే చోటు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ పోకడలను ఇందులో మరింత రూట్‌లోకి వెళ్లి చూపించే ప్రయత్నం చేశారు. 

మొదటి భాగంలో భూమయ్య, అతని ఫ్రెండ్స్ స్కూల్‌కి, కాలేజ్ కి సైకిళ్లపై వెళ్లడం, అమ్మాయి వెంటపడటం, ఆ టీనేజ్‌ ప్రేమలు, అమ్మాయితో మాట్లాడేందుకు ఇబ్బంది పడటం, సిగరేట్‌ అలవాట్లు, మందు అలవాట్లు చేసుకునే తీరు సహజంగా చూపించాడు. ఆయా సన్నివేశాలను కూడా చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించాడు. అవన్నీ 90 కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. అందులో ఆయా పాత్రలు కాదు మనల్ని మనం చూసుకుంటాం. మన గతం గుర్తుకు వచ్చేలా ఉంటుంది. ఇక చదవుపై ఇంట్రెస్ట్ లేక కాపీకొట్టడాలు, చిట్టిలు కొట్టడాలు వంటి సన్నివేశాలు చాలా ఫన్నీగా చూపించాడు. అదే సమయంలో రైతు కుటుంబాల ఇంట్లో పరిస్థితులను సున్నితంగా టచ్‌ చేశాడు. మరోవైపు పటేళ్లు అమాయక రైతుల నుంచి భూములు లాక్కునేందుకు, కుట్రలు చేసి తక్కువ ధరకే కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం వంటి అంశాలను కూడా ఆవిష్కరించారు. పారలల్‌గా రెండు రకాల కథలను ఈ చిత్రంలో ఆవిష్కరించాడు దర్శకుడు. ఆ విషయంలో సినిమాని నడిపించిన తీరు బాగుంది. 

సినిమాని చాలా రియలిస్టిక్గా తీసుకెళ్లే క్రమంలో కొంత సీరియస్ గానే వెళ్తుంది. సహజంగా స్టూడెండ్స్ చేసే అల్లరి చిల్లర పనుల్లో ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. కానీ ఇందులో ఆ మోతాడు సరిపోలేదు. అక్కడక్కడ మాత్రమే కాస్త నవ్వించేలా ఉంది. చాలా వరకు ఓ మూడ్‌లోనే సినిమా సాగుతుంది. ఫన్‌కి స్కోప్‌ ఉన్నా, ఆ దిశగా మరింత ఫోకస్‌ పెట్టలేదు. అదే సమయంలో చాలా వరకు కొత్త యాక్టర్స్ కావడంతో కొంత సహజంగానే చేసినా, అనుభవ లేమి మాత్రం చాలా సీన్లలో కనిపిస్తుంది. టేకింగ్‌ పరంగానూ ఆ తేడా కనిపిస్తుంది. మరోవైపు మట్టిపై రైతుకి ఉన్న ప్రేమ, ఎమోషన్‌ని ఇంకా బాగా చూపించాల్సింది. సినిమాలో బలమైన కాన్‌ఫ్లిక్స్ ఇంకా పెడితే కథ ఇంకా రక్తికట్టించేలా ఉండేదేమో. కథలో సంఘర్షణని గానీ, ఫన్‌ని గానీ, ఎమోషన్స్ ని గానీ బలంగా చూపించలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఏదో లైటర్‌ వేలో టచ్‌ చేసుకుంటూ వెళ్లినట్టుగానే అనిపిస్తుంది. అదే సమయంలో సీన్లు కూడా కట్‌ కట్‌ అలానే ఉన్నాయి. దీంతో ఆ ఫీల్ క్యారీ కాలేదు. అయితే తెలంగాణ నేపథ్యంలో సినిమా అంటే ఇటీవల వస్తోన్న సినిమాల్లో తాగుడు తినడం మాత్రమే చూపిస్తున్నారు. ఈ సినిమాలో వాటిని పక్కన పెట్టి అసలు వాస్తవాలు చూపించడం విశేషం. ఇక అప్పటి వరకు ఏదో సరదాగా అల్లరి చిల్లరగా కథ సాగినా, క్లైమాక్స్ లో మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. సడెన్‌గా ముగింపు కూడా ఏదో వెలితి అనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

నటీనటులుః 
భూమయ్య పాత్రలో అజయ్‌ హీరోగా మొదటి సినిమానే అయినా పాత్రలో జీవించాడు. పాత్రకి ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. అతని నటన చాలా సహజంగా ఉంది. అతని ఫ్రెండ్స్ గా చేసిన అక్షయ్‌ సాయి, రాజు ఆలూరి కూడా ఆకట్టుకున్నారు. శ్రీనుగా అక్షయ్‌ సాయి నటన బాగుంది. ఊర్లో ఇలాంటోడు కచ్చితంగా ఉంటాడు. యాదగిరి పాత్రలో రాజు ఆలూరి పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది. రాణిగా మాయ పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. శేఖర్‌ పాత్రలో నటించిన బల్వీర్ సింగ్‌ నటన కూడా నవ్వులు పూయిస్తుంది. మిగిలిన పాత్రలు చాలా వరకు సహజంగా కనిపిస్తాయి. 

టెక్నీషియన్లుః
సినిమాకి ప్రధాన బలం సంగీతం. స్మరణ్‌ సాయి చాలా మంచి మ్యూజిక్‌ అందించారు. పాటలు గుర్తిండిపోవుగానీ, ప్లజెంట్గా ఉంటాయి. ఫర్వాలేదనిపిస్తాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. ఆ విషయంలో తన బెస్ట్ ఇచ్చాడు. చిన్న సినిమా అనే ఫీలింగే అనిపించదు. సినిమా నిడివి గంటన్నరనే ఎడిటింగ్‌ పరంగా చేయడానికి ఏం లేదు. సాయినాథ్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు పవన్ కడియాలాకిది తొలి చిత్రమైనా చాలా బాగా తెరకెక్కించాడు. రియలిస్టిక్‌గా కథని చెప్పే ప్రయత్నం చేశాడు. డైలాగులు చాలా సింపుల్‌గా ఉంటాయి, కానీ ఆకట్టుకుంటాయి. కథని నడిపించిన తీరు బాగుంది. కమర్షియాలిటీకి పోకుండా రియాలిటీగా, జెన్యూన్‌గా కథ చెప్పడం అభినందనీయం. కాకపోతే ఫన్‌ సైడ్ ఫోకస్‌ పెడితే ఇంకా బాగుండేది. సినిమా మేకింగ్‌ క్వాలిటీ  అంతగా లేదు. కానీ తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ చేశారని చెప్పొచ్చు. 

ఫైనల్‌గాః పల్లెటూరి `మట్టికథ`. క్రిటిక్స్ ఫిల్మ్. అవార్డులొస్తాయి.. రివార్డులు కష్టం.

రేటింగ్‌ః 2.75
 

Follow Us:
Download App:
  • android
  • ios