‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ రివ్యూ
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు.
`రాజావారు రాణీగారు` సినిమాతో హీరోగా కెరీర్ మొదలెట్టిన కిరణ్ అబ్బవరపు మొదట సినిమాతోనే ప్రూవ్ చేసుకుని వరస ఆఫర్స్ సంపాదించాడు. ఇప్పుడు తన రెండో సినిమా `ఎస్.ఆర్.కల్యాణమండపం` కు కథ,మాటలు,స్క్రీన్ ప్లే ఇచ్చి హీరోగానూ చేసాడు. ఈ సినిమాకు సైతం ట్రైలర్ రిలీజ్ కాగానే బాగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు పెద్ద సినిమాలు సైతం ఓటీటీలకు వెళ్తుంటే ధైర్యంగా థియోటర్ రిలీజ్ కే వచ్చాడు. అసలు ఈ సినిమాని అంతలా నమ్మటానికి ఏముంది...కథేంటి.. నమ్మకంతో థియోటర్ రిలీజ్ కే దిగాడు. అంత నమ్మకం కలిగించిన ఈ సినిమా కథేంటి...ఎలా ఉంది,సినిమా హైలెట్స్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ..
కడప జిల్లా రాయచోటిలో లో ఒకప్పుడు 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' చాలా ఫేమస్. ఆ కళ్యాణ మండపం తండ్రి వారసత్వంగా వస్తుంది ధర్మ (సాయికుమార్). అయితే డబ్బులో పుట్టిన పెరిగిన ధర్మ భాద్యత లేకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. అక్కడే ఇరవై నాలుగు గంటలూ తాగుతూ గడుపుతూంటాడు. ఊరంతా అతన్ని చూసి నవ్వుకునే స్దాయికి వచ్చేస్తాడు. ఆ మండపంను బుక్ చేసుకున్న వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో మ్యారేజ్ లను కాన్సిల్ చేసుకుంటూంటారు. ఇక ధర్మకు ఒక్కడే కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). సిటీ లో ఇంజనీరింగ్ చదువుతున్న అతను ఓ లవ్ స్టోరీ. తన ఊరి అమ్మాయి, క్లాస్ మేట్ సింధు (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమలో మునిగితేలుతూంటాడు. ఆమె కళ్యాణ్ ని లైట్ తీసుకుంటుంది. ఈ లోగా ఇంట్లో ఆర్ధిక పరిస్దితులు దిగజారతూంటాయి. అప్పటికే కళ్యాణ మండపం తాకట్టులో ఉంది.
ఇలాంటి సిట్యువేషన్ లో తల్లి మాట మీద చదువును పక్కన పెట్టి, తన ప్రెండ్స్ తో కలిసి కళ్యాణ్ సొంత వూరుకి వచ్చి కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. నిలబెడతాడు. అదే సమయంలో ఆ కళ్యాణ మండపం రిజస్టర్ లో ఒక సారి పెళ్లి నమోదు చేసుకుంటే ఆగకుండా చూడాలనే డెసిషన్ తీసుకుంటారు. ఆక్రమంలో ఓ రోజు వాళ్ల దగ్గరకు ఓ మ్యారేజ్ వస్తుంది. దాన్ని నమోదు చేస్తారు. తీరా చూస్తే అది తను ప్రేమించిన సింధు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆమె పెళ్లి ఆపుతాడా తాము పెట్టుకున్న రూల్ ని తామే అతిక్రమిస్తాడా లేక తన ప్రేమను త్యాగం చేస్తాడా..అలాగే తండ్రీ కొడుకులైన ధర్మా, కళ్యాణ్ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది..వంటి వియషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం ఎలా ఉందంటే..
చాలా చిన్న స్టోరీ లైన్ తో తయారైన ఇలాంటి సినిమాలకు కథనమే ప్రధానంగా ఉండాలి. ట్రీట్మెంట్ బాగుంటేనే వర్కవుట్ అవుతాయి. ఫస్టాప్ దాకా పరుగెట్టిన కథనం సెకండాఫ్ కు వచ్చేసరికి సెంటిమెంట్ మంటల్లో ఇరుక్కుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ దగ్గర సెట్ చేసిన కాంప్లిక్ట్స్ ని అలాగే వదిలేసారు. హీరో తను కష్టపడి నిలబెట్టుకున్న కళ్యాణమండపంలో పెట్టుకున్న రూల్ అయిన..పెళ్లి నమోదు చేసుకున్న వాళ్లకు ఎట్టిపరిస్దితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పెళ్లి చేస్తాము ని స్క్రిప్టులో మర్చిపోయారు. అలా హీరోయిన్ కు తన కళ్యాణమండపంలో పెళ్లి నమోదు అయితే ..తమ రూల్ నే ఫాలో అవుతూ ..ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఆసక్తికరమైన విషయం. ఆ దిసగా సెకండాఫ్ కథ నడవలేదు. ఆ కాంప్లిక్ట్ ని కొనసాగించకుండా రెండు సీన్స్ లో తేల్చేసారు. అలాంటప్పుడు ఇంక కథలో కాంప్లిక్ట్స్ ఎక్కడుంటుంది. దాంతో సెకండాఫ్ ని తండ్రి,కొడుకుల ఎమోషన్ తో నింపేసే ప్రయత్నం చేసారు. ఈక్రమంలో ఫస్టాఫ్ లో ఉన్న యూత్ అప్పీల్ మొత్తం సెకండాఫ్ కు వచ్చేసరికి పోయింది. తండ్రీకొడుకుల జరిగే భావోద్వేగాలు సీన్స్ నే నమ్ముకున్నారు. అసలు ప్లాట్ ని వదిలేసి సబ్ ప్లాట్ వైపు ప్రయాణం పెట్టుకుంటే పెద్దగా కలిసొచ్చేదేముంటుంది. ఫస్టాఫ్ ఉన్నట్లుగా సెకండాఫ్ లేదు. సీన్స్ ఇక సినిమా క్లైమాక్స్ కు వస్తోంది కదా ముగించాలి అన్నట్లుగా వచ్సేస్తూంటాయి. దాంతో కొద్దిసేపు సినిమా ఫ్లో కోల్పోయింది. అలాగే హీరో,హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా సంపూర్తిగా లేదు. ఇక చిత్రానికి కథ, కథనం, మాటలు హీరో కిరణ్ అబ్బవరం చేసారు. మంచైనా, చెడైనా అతనికే చెందుతుంది. కథను మరింత ఆకట్టుకునేలా తయారు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మరింత బెటర్ మూవీగా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ నిలిచేది.
టెక్నికల్ గా..
డైలాగులు ఈ సినిమాకు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా పెళ్ళి, దాన్ని ఒకప్పుడు ఎంత బాగా ప్రేమానుబంధాలతో చేసుకునేవారు, ఇప్పుడెలా జరుగుతున్నాయి..అంటూ హీరో కాలేజీలో చెప్పే సీన్ అయితే చాలా బాగుంది. సినిమా ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్ తో వచ్చే ” ఏ అన్నో మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా..? లేక వాళ్లకు నడుములు లేవా ..? ప్రతి ఒక్కడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుముతోనేనా పంచాయితీ డైలాగ్ బాగా పేలింది. పాటల్లో భాస్కరభట్ల రాసిన ‘సిగ్గెందుకురా మామా’ పాట బాగా వర్కవుట్ అయ్యింది. మాస్ లోకి బాగా వెళ్లిపోతుంది. మిగిలిన పాటలు సోసోగా ఉన్నాయి. డైరక్టర్ గా చెప్పుకోవటానికి తనకంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. చేతన్ భరద్వాజ సంగీతం మూవీకు బాగానే ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి.
నటీనటుల్లో .... కిరణ్ అబ్బవరంలో మంచి ఈజ్ తో చెలరేగిపోయాడు. ఫన్ , డాన్స్, ఫైట్స్ లు ఇలా అన్నిటిలోనూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసాడు. ఇక ఈ సిమిమాకు మరో ప్లస్ పాయింట్ ..హీరో తల్లిదండ్రులుగా తులసీ, సాయికుమార్ చేయటం. వాళ్లిద్దరూ చాలా నేచురల్ గా ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సింధుగా ప్రియాంక జవాల్కర్ బాగానే ఉంది. కాలేజీ ప్రిన్సిపాల్ గా భరణి కు చెప్పుకునేందుకు ఏమీ లేదు. నెగిటివ్ పాత్ర వడ్డీల పాపారావు పాత్ర చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ లో డ్రామా ఎక్కువైందనిపించింది.స్టేజ్ మీద నటిస్తున్నట్లుగా చేసారు.
సాయికుమార్ పెర్ఫామెన్స్, అతని క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. తండ్రి కొడుకుల రిలేషన్ సీన్లు కొద్దిగా వర్కౌట్ అయ్యాయి.
ఫైనల్ థాట్..
హీరో బిల్డప్,ఎలివేషన్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ద సెకండాఫ్ ట్రీట్మెంట్ మీద పెట్టుంటే బాగుండేది
రేటింగ్: 2.5 / 5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
బ్యానర్ : ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్, తులసి, శ్రీకాంత్ అయ్యంగర్, తనికెళ్ళ భరణి, అరుణ్, అనిల్ జీల, భరత్, కిట్టయ్య తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్ అబ్బవరం
ఛాయాగ్రహణం: విశ్వాస్ డేనియల్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పాటలు: భాస్కరభట్ల, కృష్ణా కాంత్
నిర్మాతలు: ప్రమోద్, రాజు
సహా నిర్మాత: భరత్ రొంగళి
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యాం
దర్శకత్వం: శ్రీధర్ గాదె
రన్ టైమ్ :160 నిముషాలు
విడుదల తేదీ: 6 , ఆగస్ట్ 2021