సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’రివ్యూ
ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘గల్లీ రౌడీ’ సినిమాపై అంచనాలు పెరిగాయి.
సందీప్ కిషన్ కి సరైన సినిమా పడితే బాగా చేస్తాడు. యాక్షన్ కామెడీ అంటే ఇరగతీస్తాడు. ఇంతకు ముందు `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` లో అదరకొట్టలేదా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత చాలా సినిమాలు మనకు ఎక్కకపోయినా. ఏదో ఆశ..కామెడీ ఉంటుది అనే ధీమా ఇచ్చిన ట్రైలర్ చూసి థియోటర్ కు వెళ్తాం. డైరక్టర్ నాగేశ్వరరెడ్డి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే ఇద్దరూ నవ్వించటంలో పీహెచ్ డీ చేసినవాళ్లే. ఈ క్రమంలో లాంటి ఈ సినిమాలో బాగానే నవ్వించే ఉంటారు అని నమ్మకం ఎలాగో ఉంది. ఇవన్నీ ఏ మేరకు వర్కవుట్ అయ్యాయి.ఈ కాంబోలో వచ్చిన `గల్లీ రౌడీ` బాగా నవ్వించాడా? సందీప్ కిషన్ కు ఈ సినిమా హిట్ జోన్ లో పడేస్తుందా ?
కథ
వైజాగ్ వాసు (సందీప్ కిషన్)ని పెద్ద రౌడీని చేసి తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)ని చంపించాలని తాత మీసాల సింహాచలం(నాగినీడు) ఆశయం. అయితే వాసుకు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనే కోరిక. దాంతో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందినా గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే జీవితం మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఇవ్వదు కదా. తను ప్రేమించిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) ఫ్యామిలీ ఆస్తి సమస్యలో ఉంటే రౌడీ గా మారి బైరాగి నాయుడు ని కిడ్నాప్ చేద్దామనుకుంటాడు. అదీ ఆమె ఫ్యామిలీ సాయింతో. కానీ ఆ కిడ్నాప్ అనుకున్నట్లు జరగదు. మధ్యలోనే బైరాగి నాయుడు హత్యకు గురి అవటంతో ఆగిపోతుంది. దాంతో అటు భైరాగి నాయుడు కొడుకు, మరో ప్రక్క ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ నాయక్(బాబీ సింహ) వీళ్ల వెనకపడతారు. ఈ క్రమంలో వాసు ఏం నిర్ణయం తీసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్) క్యారక్టర్ ఏమిటి...అసలు బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న గొడవలు ఏంటి? వాసు లవ్ స్టోరీ ఏమైంది అనేదే మిగతా కథ
ఎనాలసిస్ ..
సరైన కామెడీ సినిమా పడితే చూద్దాం అన్నట్లుగా జనం ఎప్పుడూ కాపు కాచుకునే ఉంటారు. అయితే ఆ కామెడీ ఈ కాలంది అయ్యిఉండాలనేది ఫస్ట్ కండీషన్ గా కోరుకుంటారు. రాత,తీత రెండు కొత్తగా కాస్త స్టైల్ గా కోరుకుంటున్నారు. కామెడీకు మేకింగ్ ఎందుకు నవ్విస్తే చాలు అనుకున్నా కొన్ని సార్లు బాగానే వర్కవుట్ అవుతుంది. అయితే అది హిలేరియస్ గా ఉండాలి. పదే పద్దే నవ్వుకునేలా ఉండాలి. అందులోనూ పెద్ద హీరోలు సైతం కామెడీ స్లాట్ లోకి వచ్చేసి అప్పుడప్పుడూ నవ్వించేస్తున్నారు. ఈ కరమంలో వచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్ అంటే ఏం ఊహిస్తాం. ఏదో చేసే ఉంటాడు అనుకుంటాం. అందులోనూ సీమశాస్త్రి లాంటి మంచి హిట్ సినిమాలు గతంలో ఇచ్చిన దర్శకుడు నాగేశ్వరరెడ్డి దర్శకత్వం. కానీ సినిమా ప్రారంభమైన కొద్ది సేపట్లోనే మన ఊహలు, అంచనాలు గాలికి ఎగిరిపోతాయి. సర్లే వాటిన్నటిని ప్రక్కన పెట్టి చూద్దామనుకున్నా మనస్సు ఒప్పదు. హీరో వారసత్వ రౌడీ కావాలనుకుంటున్నాడు అంటే దాని చుట్టూ కామెడీ తిరుగుతుందని అనుకుంటాం.
కానీ కాసేపటికే అది మెల్లిగా భూ కబ్జా..అన్యాయమైన ఫ్యామిలీ, వాళ్లంతా నాని సినిమా `గ్యాంగ్ లీడర్` లో గ్యాంగ్ లా ఉంటూ ,ఆలోచించి హీరోని పట్టుకుని కిడ్నాప్ చేయమని అడగటం. అతను సరే అనటంత, ఇవన్నీ నవ్వు తెప్పించవు. అయినా సరే అక్కడక్కడా పంచ్ లు పేలుతున్నాయి కదా అని, ముందుకెళ్తే సెకండాఫ్ లో హీరో మాయమైపోతాడు. అతనికి పనేమి ఉండదు. కథ అంటేనే కాంప్లిక్ట్. ఆ కాంప్లిక్ట్ లో పడేవాడే ప్రధాన పాత్ర లేదా హీరో. అంటే హీరో సందీప్ కిషన్ కాంప్లిక్ట్ లో పడాలి. కానీ చిత్రంగా రాజేంద్రప్రసాద్ పాత్ర పడుతుంది. దాంతో కథ అంతా అతని చుట్టూ తిరుగుతుంది. అతనికే సమస్యలు వస్తాయి. హీరో కేవలం ఆ సమస్యలను వినటం. అప్పడప్పుడు తనకు తోచిన పరిష్కారాలు సూచించటం. అంటే కథలో హీరోని మర్చిపోయి నడిపేసారన్నమాట. అంతేనా విలన్ ని ఇంటర్వెల్ కు చంపేసారు. అంతకన్నా పవర్ ఫుల్ విలన్ ని సెకండాఫ్ లో ప్రవేసపెట్టలేకపోయారు. దాంతో సెకండాఫ్ తేడా కొట్టేసింది. సెకండాఫ్ పూర్తిగా మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా నడిచింది. అదేమైనా గొప్ప ఇంటిలిజెంట్ ప్లేనా అంటే అదీ టుమ్రీనే. దాంతో ఎన్ని కామెడీ ట్రాక్ లు, డైలాగులు ఉంటే ఉపయోగం ఏమిటి?
నచ్చేవి:
ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే కిడ్నప్ డ్రామా
వెన్నెల కిషోర్ క్యారక్టరైజేషన్
డైలాగులు
నచ్చనవి:
అవుట్ డేటెడ్ కథ, కథనం
సరిగ్గా సాగని లవ్ ట్రాక్
నాని 'గ్యాంగ్ లీడర్' ఛాయలు
టెక్నికల్ గా...
రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం లో పాటలు ఎలా ఉన్నా, రీరికార్డింగ్ బాగుంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫి జస్ట్ ఓకే. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తీసేయాల్సింది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. దర్శకత్వ పరంగా కామెడీని, ఈ థ్రిల్ నీ రెండింటినీ మిక్స్ చేయడంలో నాగేశ్వరెడ్డి తడబడ్డాడనిపించింది. సీన్స్ పాత సినిమాల్నిగుర్తుకు తెచ్చేలా సాగటంతో..., ముతక ఫీలింగ్ కలిగింది. ఉన్నంతలో డైలాగులు చాలా వరకు సినిమాని నిలబెట్టాయి. ఆ డైలాగులుని రాజేంద్రప్రసాద్ వంటి కామెడీ తెలిసిన ఆర్టిస్ట్ నెక్ట్స్ లెవిల్ కు తీసుకెల్లాడు కొన్ని చోట్ల. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్ చేసే ఫన్ కూడా బాగుంది.
నటీనటుల్లో సందీప్‌కిషన్ బాగా చేసాడు. కాకపోతే అతని కెరీర్ కు ఇలాంటి సినిమాల వల్ల ఒరిగేదేమీ ఉండకపోవచ్చు..కెరీర్ లో ఇంకో సినిమా పెరగటం తప్పించి. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే బాగా చేసారు. బాబీ సింహా వల్ల కలిసొచ్చిందేమీ లేదు కథకు. రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి బాడీ లాంగ్వేజ్ బాగుంది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్,పోసాని నవ్వించే ప్రయత్నం చేశారు.మిగతా వారు తమ పాత్రల పరిధి మేర నటించారు. హీరోయిన్ నేహా శెట్టి గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ లేదు.
ఫైనల్ థాట్
‘రౌడీ’లు అప్ డేట్ కాకపోతే గల్లీలో కూడా బ్రతకటం కష్టమే
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
తెర వెనుక..ముందు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్;
నటీనటులు: సందీప్ కిషన్, నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: రామ్ మిర్యాల, సాయి కార్తిక్; సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్;
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్;
రచన: నందు;
నిర్మాత: కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ;
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి;
విడుదల తేదీ: 17-09-2021
రన్ టైమ్: 2గంటలు 23 నిముషాలు