Hey Sinamika Review:దుల్కర్ సల్మాన్ 'హే సినామికా' రివ్యూ
మహానటి'తో మనకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్... 'ఓకే బంగారం', 'కనులు కనులు దోచాయంటే' చిత్రాలతో తెలుగునాట మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ రోజు 'హే సినామికా' సినిమా తో థియేటర్లలోకి వచ్చారు.
దుల్కర్ మొదటి నుంచీ డిఫరెంట్ జానర్ లో సాగే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే దుల్కర్ సినిమాలకు ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. దానికి తోడు సక్సెస్ పుల్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. అలాగే 'బాహుబలి'లో కిలికిలి భాష సృష్టికర్త మదన్ కార్కి కథ అందించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని ఈ సినిమా ఏ మేరకు రీచ్ అయ్యింది... కొరియోగ్రాఫర్ బృందా ..దర్శకురాలిగా తన ముద్ర వేయగలిగారా ? అసలు సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
ఆర్యన్ (దుల్కర్ సల్మాన్),మౌన (అదితిరావు) మ్యారేజ్ లైఫ్ రెండేళ్లు బాగానే నడుస్తుంది. అయితే ఆర్యకు కొద్దిగా అతి వ్యవహారం. తన ప్రేమను పొసిసెవ్ గా మార్చేసి విసిగిస్తూంటాడు.అతి వాగుడు...అతి ప్రేమ ను తట్టుకోవటం కష్టమనిపిస్తుంది. ఓ రకంగా మౌన ఈ వివాహ బంధం నుంచి స్వేచ్చ కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆమె విసుగెత్తిపోయి,మొగడుని భరించలేక సైక్రాటిస్ట్ మలర్ (కాజల్)ని కలుస్తుంది.మలార్ ఓ స్పెషల్ క్యారక్టర్...మొగడు పెళ్లాలని విడతీయటంలో పీహెచ్ డీ చేసినట్లు,రికార్డ్ లు బ్రద్దలు కొట్టి ఉంటుంది. ఆమెని కలిసి తన భర్తతో విడాకులు తీసుకుందామనుకుంటున్నానని చెప్తుంది. తన భర్తతో చనువుగా నటిస్తే,వలలో పడేస్తే, అది చూపించి విడాకులు తీసుకుంటానని తన పని ఈజీ అయ్యిపోతుందని చెప్తుంది. మొదట నో అన్నా కాసేపటకి ఓకే అని చెప్పిన మలర్ ...ఆ పని మీద ఉండి ఆర్యతో టచ్ లోకి వెళ్తుంది. అంతేకాదు కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడిపోతుంది. అక్కడ నుంచి కొత్త సమస్యలు మొదలు. అసలు విషయం ఆర్యకు తెలిసిందా...అతను కూడా మలర్ తో ప్రేమలో పడ్డాడా లేక మౌనతోౌనే ముందుకు వెళ్దామనుకుంటున్నాడా...చివరకు ఏమైందనేది మిగతా కథ.
ఎలా ఉంది..
ఒక్క ముక్కలో చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఇలాంటి కథలు ఎన్నో మనం తెలుగు తెరపై చూసాం. తమిళంలో అయితే మరీ ఎక్కువ.అప్పట్లో కాజల్, అరవింద స్వామి, ప్రభుదేవా చేసిన మెరుపు కలలు గుర్తు వస్తుంది. దుల్కర్ లాంటి ఈ జనరేషన్ నటుడుతో అస్సలు చేయాల్సిన కథ కాదు. ఇందులో కథ ఉంది, స్క్రీన్ ప్లే ఉంటుంది. అలాగే వరసపెట్టి సీన్స్ ముందుకు సాగిపోతుంటాయి కానీ సినిమా చూస్తున్న ఫీల్ మాత్రం ఎక్కడా కలగదు. చాలా సినిమాల్లో చూసిన కథే కావటం ఓ కారణం కావచ్చు. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ సన్నివేశాలు అల్లారు. దుల్కర్ చెప్పే సంభాషణలు కానీ సీన్స్ లో కానీ ఆయన మార్క్ నటన కనపడదు. సినిమాలో ఆకట్టుకునే అంశాలేవీ లేవు. బలమైన కథ, కథనాలు, పకడ్బందీగా సాగే సన్నివేశాలు లేకపోతే ఎంత గొప్ప స్టార్ కాస్టింగ్ ఉన్నా ఫలితం లేదని నిరూపించే మరో చిత్రమిది. అయితే పాత కథలను కూడా కొత్తగా స్క్రీన్ ప్లేలతో చెప్పి హిట్ కొడుతూంటారు. అయితే ఆ మ్యాజిక్ ఇక్కడ జరగలేదు. ముఖ్యంగా ఈ కథకి మొదటి నుంచే సన్నివేశ బలం జోడించలేకపోయారు దర్శకురాలు. ఎక్కువ శాతం డైలాగులతోనే సరిపెట్టాడు. బలమైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఎనభైలు,తొంబైల్లో వచ్చిన సినిమా మాదిరిగా మారేది కాదు. అయితే ఈ జనరేషన్ కు బహుషా అదే వెరైటీ అనుకున్నారేమో. టోటల్ గా పాత కథని పాతగానే డీల్ చేసి శుభం కార్డు వేసేశారు.
టెక్నికల్ గా...
మొదట కొరియాగ్రాఫర్ నుంచి డైరక్టర్ గా మారిన బృద..దర్శకురాలిగా అసలు న్యాయం చేయలేకపోయారు. తన అనుభవం అంతా రంగరించి ఎనభైల నాటి కథను ఎంచుకున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఆ రోజులనే గుర్తు చేస్తున్నట్లుగా నేరేషన్ నడుస్తుంది. సినిమా హిట్ అవ్వచ్చు..ప్లాఫ్ అవ్వచ్చు...అది వేరే సంగతి. అసలు ఇన్ని సినిమాల చేసిన ఆమె...కథకు కావాల్సిన బేసిక్ ఎమోషన్ పట్టుకోకపోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాత్రం అయినా చివరి దాకా చూడగలిగాము అంటే దుల్కర్, కాజల్ , అదితిరావు వంటి ఆర్టిస్ట్ ల గొప్పతనమే. కెమెరా వర్క్, మ్యూజిక్ డీసెంట్ గా నీట్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. ఎడిటింగ్ మాత్రం విసుగిస్తుంది. ఓ ఇరవై నిముషాలైనా లేపేయాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటులు చూస్తే...
దుల్కర్ కి ఫ్లాఫ్ లు లేవు కానీ బ్లాక్ బస్టర్స్ పడటం లేదు. అలాగని అతని నటనకి మాత్రం వంక పెట్టలేం. చాలా సెటిల్ గా చేస్తాడు. ఇందులో ఆర్య పాత్రని కూడా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. క్యారెక్టర్ లోపాల వల్ల అయ్యిండవచ్చు కొన్ని చోట్ల మాత్రం క్లూ లెస్ గా,ఇబ్బందిగా తనేం చేయాలో అర్దం కానట్లు కనిపించాడు. అదితిరావు పాత్ర ఓకే. కానీ లాజిక్ లెస్. ఆమెది కూడా కొంచెం బుర్రలేని క్యారెక్టరే. కాజల్ మంచి ఆర్టిస్ట్. సైక్రాటిస్ట్ పాత్రలో సహజత్వం లేదు. దాంతో తేడాగా కనిపించింది. సినిమాలో అన్ని పాత్రలు కొంచెం క్లారిటీ తక్కువగానే తింగరగా వున్నాయి. లాస్ట్ లో ఆ పాత్రలు ఓ సినిమాటిక్ డ్రామా ప్లే చేయడం కూడా విసుగిస్తుంది. క్లైమాక్స్ కూడా సినిమాకి ఆకట్టుకోలేదు. ఇంకాస్త కొత్తగా ఆలోచించి డిజైన్ చేయాల్సింది.
ఫైనల్ థాట్
'ఒక సినిమా నచ్చటానికి సవాలక్ష కారణాలుంటాయి. కానీ, నచ్చలేదనిపించటానికి ఉన్న ఒకే ఒక్క కారణం విసుగెత్తించే కథనం'’
---సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్: 1.5/5
ఎవరెవరు...
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం: బృందా మాస్టర్
విడుదల తేదీ: మార్చి 3, 2022