Review: ఆది 'అతిథి దేవో భవ’ మూవీ రివ్యూ
ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది.
కొత్త సంవత్సరంలో ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని ఎదురుచూస్తే కరోనాతో ఆ వాతావరణం ఖర్చైపోయింది. చిన్న సినిమాలు క్లియరెన్స్ సేల్ పెట్టినట్లుగా వరస పెట్టి థియోటర్ లో దిగటానికి సిద్దపడుతున్నాయి. ఆ లిస్ట్ లో ఈ రోజు మన ముందుకు వచ్చిన చిత్రం అతిధిదేవోభవ. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ ఓ కొత్త జానర్ ని ఎంచుకుని చేసిన ఈ చిత్రం ఎలా ఉంది..అసలు ఈ కథ ఏమిటి..వర్కవుట్ అయ్యే కాన్సెప్టు యోనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
అభయ్ (ఆది)కు ఓ మానసిక సమస్య. దాని పేరు మోనోఫోబియా. దాని లక్షణం..ఒంటిరిగా ఉంటే ఆత్మహత్యా ఆలోచనలు వస్తాయి. దాంతో ఎప్పుడూ తన చుట్టు నలుగురు ఉండేలా చూసుకుంటూంటాడు. అలా ఎప్పుడూ ప్రెండ్స్ తో అభయ్ ఉంటూండతంతో విసుగెత్తిన గర్ల్ ప్రెండ్ బ్రేకప్ చెప్తుంది. ఆ తర్వాత అభయ్ జీవితంలోకి మరో అమ్మాయి వైష్ణవి (నువేక్ష) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే వైష్ణవికు తన మానసిక సమస్య విషయం తెలిస్తే వదిలేస్తుందనే భయంతో దాచిపెడ్తాడు. కానీ ఎంతకాలం...అది బయిటపడే రోజు వస్తుంది. అప్పుడు ఏమైంది. మోనో ఫోబియాను అభయ్ అధిగమించాడా? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా సినిమా తెరపై చూడాలి.
స్టోరీ ఎనాలసిస్ ...
ఇలాంటి కథలకు చాలా అనుభవం కల కథకుడు కావాలి. అలాగే ఆ కథకుడుకి సైక్లాజికల్ విషయాల పట్ల కేవలం ఆసక్తి మాత్రమే కాకుండా లోతైన అవగాహన ఉండాలి. అవేమీ ఈ కథ రనచనలో కనపడవు. థ్రిల్లర్ సినిమాలకు ఒకటే నిర్వచనం చెప్తారు...అదే “a story of high suspense.” అని. అలాగే మంచి థ్రిల్లర్ అనిపించుకోవాలంటే...గొప్ప కాంప్లిక్ట్..అందులోంచి పుట్టే అద్బుతమైన డ్రామా ఉన్న పాయింట్ ఎంచుకోవాలి. progressive tension అనేది కథలో భాగంగా సాగుతూ క్లైమాక్స్ వచ్చేదాకా మనను లీనం చేస్తూ తీసుకెళ్ళి ఊహించని మలుపుతో ముగించాలి. అయితే అవేమీ ఈ సినిమాలో కనిపించవు. కథలో సస్పెన్స్ కానీ, ఎదర ఏం జరుగుతుందనే ఆసక్తి గానీ పెద్దగా ఉండదు. సినిమా ప్రారంభంలో ఏ కాంప్లిక్ట్ తో అయితే మొదలెట్టారో అదే మార్పు లేకుండా రన్ చేయాలని చూసారు. క్యారక్టర్స్ ని, కాంప్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయటానికి చాలా టైమ్ తీసుకున్నారు. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. దానికి తగినట్లు కథ మొత్తం మోనో ఫోబియా అనే పాయింట్ చుట్టే చుట్టేసారు. తాము కొత్తగా ఫీలైనట్లున్నారు ఈ పాయింట్ ని ..అది కొద్దిసేపే ఉంటుంది..ఆ మానసిక సమస్యతో హీరో జీవితంలో ఏ పెద్ద సమస్యలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రాసెస్ లో మరిన్ని సమస్యల్లోకి ఎలా పడ్డాడు అనే విషయం పట్టించుకోకుండా , ట్విస్ట్ లు ,టర్న్ లు లేకుండా సింగిల్ పాయింట్ ఎజెండాతోనే స్టోరీని సాగదీశాడు. కీ సీన్స్ ని కూడా లైట్ తీసుకునేలా తీసారు. రియల్ లైఫ్ సీన్స్ కు, సినిమాటెక్ సీన్స్ మధ్య ప్రోపర్ బాలెన్స్ చేయకపోవటమే సమస్య అయ్యింది. కొన్ని చోట్ల కథనం చాలా అబ్సర్డ్ గా అనిపించటం మరోలోపం. ఏమైనా ఎంత ఓపిక ప్రదర్శించినా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టి విసిగిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కాస్త ఆసక్తి రేపిన ఈ చిత్రం సెకండాఫ్ లో ఆ స్దాయి టెన్షన్ ని కొనసాగించలేకపోయింది. క్లైమాక్స్ అయితే దారుణం.
టెక్నికల్ గా...
డైరక్టర్ పొలిమేర నాగేశ్వర్ ఎంచుకున్న కథకు న్యాయం చేయలేక చతికిల పడ్డారు.ఆయనకు రైటింగ్ డిపార్టమెంట్ సాయిం చేయలేదు. ఉన్నంతలో
శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఇంట్రస్టింగా ఉంది. ‘‘బాగుంటుంది నువ్వు నవ్వితే’’, ‘‘నిన్ను చూడగానే’’, ‘‘చిన్ని బొమ్మ నన్నిలా..’’ పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటర్ కార్తిక్ కత్తెర తీసి ఎంత తీసేసినా తప్పులేదనిపించింది. అమర్‌నాథ్ ఛాయాగ్రహణం సినిమాకి ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ ..రిజల్ట్ ముందే ఊహించినట్లుగా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
నటీనటుల్లో ..
ఆది సాయి కుమార్ డిఫరెంట్ వేరియేషన్స్ లో మెప్పించే ప్రయత్నం చేసాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ గా నటించిన సువేక్ష చాలా చక్కగా నటించింది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తల్లిగా రోహిణి నటన, మరో కీలక పాత్రలో నటించిన సప్తగిరి నటన చాలా బాగుంది. కానీ ఫలితం ఏముంది
ప్లస్ లు
కొత్త పాయింట్
ఆది నటన
శేఖర్ చంద్ర రీరికార్డింగ్
మైనస్ లు
బోర్ కొట్టించిన సప్తగిరి కామెడీ ట్రాక్
ప్రేమకథలో ఏమాత్రం ఫీల్ లేకపోవటం
పండని యాక్షన్ ఎపిసోడ్స్
క్లైమాక్స్
ఫైనల్ థాట్
రోగాలు కథలు కాస్త రాటుదేలిన డైరక్టర్స్ చేయాలి..లేకపోతే చూసే ప్రేక్షకులు రోగగ్రస్దులైపోతారు..వాళ్లకు సినిమా అంటే భయం,ఫోబియా పట్టుకుంటుంది.
Rating:1.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు...
నటీనటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు;
సంగీతం: శేఖర్ చంద్ర;
కూర్పు: కార్తిక్ శ్రీనివాస్;
ఛాయాగ్రహణం: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి;
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్;
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల;
విడుదల తేదీ: 07-01-2022