Asianet News Telugu

George Reddy Review: ‘జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ: రైజ్ యువర్ వాయిస్

 ‘వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ  ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్)  వచ్చేసాడు. పీడిత విద్యార్దుల పక్షాన, ప్రజా పోరాటాలపక్షాన జీవితమంతా దృఢంగా నిలిచేందుకు ప్రయత్నం చేసాడు. అయితే ఈ తరం వారికి పెద్దగా తెలియని జార్జిరెడ్డిని ఈ సినిమా ఏ స్దాయిలో పరిచయం చేసింది. 
 

'George Reddy'  movie  Review and Rating
Author
Hyderabad, First Published Nov 22, 2019, 7:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

---- సూర్యప్రకాష్ జోస్యుల 

‘వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ  ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్)  వచ్చేసాడు. పీడిత విద్యార్దుల పక్షాన, ప్రజా పోరాటాలపక్షాన జీవితమంతా దృఢంగా నిలిచేందుకు ప్రయత్నం చేసాడు. అయితే ఈ తరం వారికి పెద్దగా తెలియని జార్జిరెడ్డిని ఈ సినిమా ఏ స్దాయిలో పరిచయం చేసింది. ఎంతవరకూ ప్రేరణ ఇవ్వగలిగింది. జార్జిరెడ్డి కాలానికి (1965 నుంచి 1975) వెళ్లి ఉస్మానియా యూనివర్శిటీని ఆవిష్కరించగలించగలిగారా.. ఈ ప్రయత్నం మరిన్ని బయోపిక్ రూపకల్పనలకు లీడ్ ఇస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

తెలివైన కుర్రాడు జార్జి రెడ్డి (సందీప్ మాధవ్).  చిన్నప్పటి నుంచి అన్యాయాలకు తిరగబడటం అనే లక్షణంతో పెరుగుతాడు. 1967లో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేసేందుకు జార్జి  హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీకు వస్తాడు. అయితే అతను విద్యార్దిగా అడుగుపెట్టే సమయానికి అక్కడ పరిస్దితులు తేడాగా ఉన్నాయి. రాజకీయంగా యూనివర్శిటీలో చాలా గొడవలు జరుగుతూంటాయి. యూనివర్శిటీపై  పట్టు బిగించటానికి కొన్ని శక్తులు పోరాటాలు చేస్తూంటాయి. ముఖ్యంగా ఎబిసిడీ గ్రూప్ సత్య (సత్యదేవ్), కౌసిక్ (కృష్ణ చైతన్య), అర్జున్ (మనోజ్ నందన్) వంటివారు గ్రూప్ లుగా తయారయ్యి.. యూనివర్శిటీలో తమ పెత్తనం చూపిస్తూంటారు. వాటిని చూసిన జార్జి రెడ్డి మొదట సైలెంట్ గా ఉన్నా తర్వాత ఎదిరించటం మొదలెడతాడు. అప్పటికే హిస్టరీ, లిటరేచర్‌,  ఫిలాసఫీ ఇలా.. అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసి  మేథావిగా గుర్తింపుతెచ్చుకున్నాడు జార్జి. ముఖ్యంగా క్యూబా విప్లవ‌కారుడు చేగువేరా ప్రభావం జార్జిపై బ‌లంగా ఉంది.  దాంతో అతనిలోని పోరాట పటిమ, స్పిరిట్ చూసి చాలా మంది కొందరు కుర్రాళ్లు అతనివైపు ఆకర్షితులయ్యారు.  అలా  జార్జ్ రెడ్డి స్టూడెంట్స్ లో లీడర్ గా  రూపాంతరం చెందుతాడు. ముఖ్యంగా ఈవిటీజింగ్‌, ర్యాగింగ్‌కి పాల్పడే వారికి త‌గిన బుద్ధి చెప్పటం వంటి చర్యల ద్వారా విద్యార్థుల్లో కొత్త ఉత్తేజం వచ్చింది.

మరో ప్రక్క చదువులోనూ నెంబర్ వన్ గా ఉండటంతో...జార్జ్ రెడ్డికు ముంబైలో ఓ అడ్మిషన్ వస్తుంది.కానీ అక్కడకి వెళ్లే ముందు చేసిన  "Raise your voice before truth dies" అంటూ చేసిన  ప్రసంగం  ద్వారా చైతన్యం స్టూడెంట్స్ లో  చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అప్పటి రాజకీయ పరిస్థితులపై వాళ్లకు నిర్ధిష్ట అవగాహన కల్పిస్తాడు. ఈ స్పీచ్ అతని ఎదుగుదలను తట్టుకోలేని చాలా మందికి మంట పుట్టించింది.

ఈ లోగా యూనివర్శిటీ ఎలక్షన్స్ వచ్చాయి. జార్జి రెడ్డి అధిక మెజారిటీతో గెలిచాడు. ఇది అప్పటికే పాతుకుపోయిన గ్రూపుల్లో ఆగ్నిలో ఆజ్యం పోసిన పరిస్దితి క్రియేట్ చేసింది. దాంతో జార్జిపైనా, అతని వెనక తిరిగే కుర్రాళ్లపైనా దాడులు ఎక్కవయ్యాయి. కానీ బాక్సర్ గా రాటుదేలిన జార్జిని  భౌతికంగా కూడా ఎదుర్కొవ‌డం వాళ్ల వల్ల కాలేదు.  ఆ క్రమంలో జార్జి మరింత పెద్ద నాయకుడు అవుతున్నాడు. అతనికి మద్దతు ఇచ్చే జనం పెరిగిపోతున్నారని గమనించిన ప్రత్యర్దులు జార్జి రెడ్డిని అడ్డు తొలిగించుకోవటం తప్ప వేరే దారిలేదనే నిర్ణయానికి వస్తారు.. జార్జిని అంత‌మొందిస్తే త‌ప్ప త‌మ‌కు వ‌ర్సిటీలో స్థానం మిగ‌ల‌ద‌ని  ఫిక్సై పోయారు. అప్పుడు జార్జిరెడ్డి ఏం చేసాడు. జార్జి రెడ్డి లవ్ స్టోరీ ఏమిటి..ఎవరు అతన్ని ప్రేమించారు. ..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది...

జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నడిపించే ప్రయత్నం చేసారు. ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు చూపించారు.  అయితే నేరేషన్ డాక్యుమెంటరీ విధానంలో ఉండటంతో...ఈ సినిమా  జార్జి రెడ్డిపై తీసిన ఓ డాక్యుమెంటరీలా తయారైంది.  జార్జి రెడ్డి అనే విధ్యార్ది నాయకుడు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారమే కానీ సమగ్రత కనపడదు.  

ప్రధాన పాత్ర మనస్తత్వం పై స్పష్టత, పాత్ర ఆంతరంగిక జీవితాన్ని చూడనిదే,  మమేకం కానిదే ఇలాంటి సినిమాని అనుసరించలేం. అనుభవించలేం. పాత్ర  భావోద్వేగాలతో పాటు మనం కూడా ప్రయాణించాలి. ఆ పాత్ర బాధ తన బాధగా, ఆనందం తనదిగా అనుభూతి చెందితేనే ఇలాంటి సినిమాని ప్రేమిచగలం.  జార్జి రెడ్డి పాత్ర దేనికోసం పోరాడుతున్నాడు స్పష్టత మనకు ఇవ్వరు. దాంతో అతని లక్ష్యం ఏమిటి అనేది తెలియదు. యూనివర్శిటిలో అప్పటికప్పుడు జరిగిన కొన్ని సంఘటనలకు అతని స్పందనగా సినిమా మొత్తం కనిపిస్తుంది. దాంతో ఎమోషనల్ గా అతనితో జర్నీ చేయటం కష్టమైపోతుంది. మనకి, ఆ పాత్రకు మధ్య ఎడం ఉండిపోతుంది. జార్జిరెడ్డి పాత్ర మోటివ్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే వేరే విధంగా సినిమా ఉండేది.  

 'ప్రశ్నే ప్రశ్నార్థకమై...'

జార్జి రెడ్డి చిన్నప్పటి నుంచీ పోరాడే నైజం ఉన్నవాడు అని ఎస్టాబ్లిష్ చేసి కథను మెదెలెట్టి, ఉస్మానియా యూనివర్శిటీకు వచ్చి , అక్కడ ఆల్రెడీ పాతుకోపోయి ఉన్న కొన్ని గ్రూపులకు, వారి చేష్టలకు ఎదురు తిరిగి పోరాడతాడు. అయితే అందుకోసం ఎంచుకున్న సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడేయటంతో పెద్దగా ఆసక్తిగా అనిపించదు. యూనివర్శిటిలో విద్యార్ది పోరాటాలకు బాసటగా నిలిచి,రాజ్యహింసపై ఆగ్రహాన్ని ప్రకటించటం బాగుంటుంది. ఆ క్రమంలో అతనిలోని నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని మెచ్చుకోకుండా ఉండలేం. అయితే అదే సమయంలో వ్యవస్తీకృత హింస, ఆధిపత్య కుల, మతోన్మాద హింస, నిరంకుశదళారీ దోపిడీ విధానాలు  వీటన్నిటినీ ప్రశ్నించమని చెప్పటం మరింత అర్దవంతంగా అర్దమయ్యేలా చెప్పాల్సిందేమో అనిపిస్తుంది.  

అలాగే చాలా సేపు తెరపై చూస్తున్న విషయాలు ఏకపక్షంగా హీరో వైపు నుంచి సాగిపోతూంటాయి. సంఘర్షణకు ఎక్కడా అవకాసం ఉండదు. ముఖ్యంగా డ్రామా ఈ డాక్యుమెంటరీ తరహా సినిమాలో కనిపించదు.  దాంతో సినిమా ఎక్కడా మనని కుదపదు..పట్టుకోదు. పలకరించదు. పైకెత్తదు. ప్రశ్నించదు. దానిదో లోకం..మనదో లోకం అన్నట్లు సాగిపోతుంది. దాంతో సినిమా అసలు ఎవరీ  జార్జి రెడ్డి అనే విషయాన్ని పరిచయం చేయటంతో సరిపెట్టుకున్నట్లు అయ్యింది.  

ఇక ఫస్టాఫ్ మొత్తం కేవలం జార్జిరెడ్డి పాత్రను, అతని లవ్ స్టోరీని, యూనివర్శిటీలో కొన్ని పాత్రలను ఎస్టాబ్లిష్ చేయటంతో సరిపెట్టేసి, కథ మొత్తం సెకండాఫ్ లో పెట్టుకున్నాడు. దాంతో హడావిడి గా సీన్స్ జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. అలాగే క్లైమాక్స్ కూడా సినిమాని నిలబెట్టేంత ఎఫెక్టివ్ గా లేదు.  

హైలెట్స్ ...

దర్శకుడు ఈ సినిమాలో మనం ఇంతకు ముందు చూడని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అందించారు. ఫైర్ బాల్ ఫైట్, ఇంటర్వెల్ స్పీచ్, బ్లేడ్ ఫైట్ వంటి హైలెట్ ఎపిసోడ్స్ ఉన్నాయి.

వివాదస్పద అంశాలు ఉన్నాయా

ఏ వ్యక్తుల, సంస్దల, కులాల, మతాల, జాతుల విశ్వాసాలను,నమ్మకాలను కించపరచడానికి ఈ సినిమా తీయలేదు, అలాగే సినిమాటిక్ లిబర్టీతో తీసాం అని ముందుగానే తను జాగ్రత్తను జాగ్రత్తగా ప్రకటించిన ఈ సినిమాలో నిజానికి అంత వివాదపడటానికి, విరుచుకుపడటానికి ఏమీ లేదు.
టెక్నికల్ గా....

సురేష్ బొబ్బలి పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలెట్. అలాగే సుధాకర్ ఎక్కింటి కెమెరా వర్క్ కూడా చాలా సార్లు మనని కట్టిపారేస్తుంది. ముఖ్యంగా ప్రారంభంలో చూపే కేరళ ఎపిసోడ్ చాలా అద్బుతంగా అనిపిస్తుంది. ఇక  ప్రొడక్షన్ డిజైన్ చూస్తే..ఉస్మానియా యూనివర్శిటీ సెట్ ఫెరఫెక్ట్ గా ఉంది. ఎడిటింగ్ వర్క్ మాత్రం మరింత షార్ప్ గా ఉండాల్సిందనిపిస్తుంది. డైలాగులు చాలా బాగున్నాయి.   డైరక్టర్ గా జీవన్ రెడ్డి చాలా చోట్ల మెరుపులు కురిపించారు. ఆయన్ని కథే వెనక్కి లాగేసింది.  జార్జి రెడ్డిగా సందీప్ ...పాత్రకు జీవం పోయటానికి ప్రయత్నించాడు. చాలా సార్లు సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ ధాట్

జార్జి రెడ్డి ఎవరు ..ఆయన చేసిందేమిటి అనే విషయాలు ఈ తరానికి తెలియచెప్పాలనే దర్శకుడు ఆలోచన మంచిది. అయితే ఆ ఆలోచన మనలో ఆలోచనలు లేపే విధంగా ఉంటే ఇంకా బాగుండేది.

రేటింగ్: 2.5/5
 ---
నటీనటులు: సందీప్ మాధవ్, దేవిక, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి , వినయ్‌ వర్మ తదితరులు
 కెమెరా: సుధాకర్‌ యెక్కంటి,
సంగీతం: సురేష్‌ బొబ్బిలి,
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్,
అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌: దాము రెడ్డి, సుధాకర్‌ యెక్కంటి,
సహ నిర్మాత: సంజయ్‌ రెడ్డి.
కథ,మాటలు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవన్ రెడ్డి
నిర్మాత: అప్పిరెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios