యలమర్తి అనూరాధ కథ: ప్రేమ గెలుపు
తండ్రీకూతుళ్ళ మధ్య అనురాగాన్ని యలమర్తి అనూరాధ రాసిన 'ప్రేమ గెలుపు' కథలో చదవండి.
చిన్నప్పటినుంచీ అదేమిటో నాన్న అంటే నాకు ఇష్టం. ఎందుకిలా అంటున్నాను అంటే అందరికీ అమ్మ అంటే ఇష్టం ఉంటుందిగా. అమ్మన్నా ఇష్టమే. నాన్న కాస్త ఎక్కువ అన్నమాట. సంతోషమైనా బాధైనా పంచుకోవటానికి నాన్న దగ్గరికే పరుగెత్తే దాన్ని. ఆయనకే ముందు చెప్పేదాన్ని. దీనికీ ఒక కారణం ఉంది.
ఆడపిల్లనని ఆంక్షలు పెట్టేవారు కాదు నాన్న. స్వేచ్ఛగా పెరగనిచ్చారు. అలాగని ఆ స్వేచ్ఛను నేనెప్పుడూ దుర్వినియోగపరచుకోలేదు. అలా ఈ బంధం ప్రేమతో ముడిపడి మరింత దృఢంగా పెరిగిందే కానీ తరగలేదు.
మొదటిసారి నాన్నతో విభేదించవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదీ ఆస్థి విషయంలో. ఎప్పుడూ నేను ఆడపిల్లలను, మగ పిల్లలను తల్లిదండ్రులు సమానంగా చూడాలనే దృక్పథంలో ఉండేదాన్ని. దానికి ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేక పోయేదాన్ని .
అమ్మని ఒకసారి పట్టుచీర కొనుక్కోమని నాన్న పదివేలు ఇస్తే ఆ డబ్బును కూతుళ్ళు కోడళ్ళతో సమానంగా పంచుకొని ఇదే నాకిష్టం అని అంది. ఆరోజు నేను ఎంత సంబరపడ్డానో! తల్లి అంటే ఇలా ఉండాలని అనుకున్నా. కానీ ఆస్థి పంచటం దగ్గరకు వచ్చేటప్పటికి నాన్న చిన్నచూపు చూశారు. అమ్మ ఆయన్నే సమర్థించింది. అలాంటప్పుడు ఆడపిల్లలకున్న ఆస్థిని చూస్తుంది అమ్మ. అదేదో తన మగ పిల్లలకు లేనట్లు. ఇది అన్యాయం కదా? అసలు విషయం చెప్పలేదు. నాన్న మాకున్న పొలంలో కొంత అమ్మేసారు. దానికి 20 లక్షలు వచ్చింది. అందులో పదిలక్షలు తీసుకొని మిగతాది ఇస్తానన్నారు. అదెలా అంటే ఇద్దరు మగ పిల్లలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు, ఆడపిల్లలకు ఒక లక్ష అన్నట్లు. అలా ఎందుకు? సమానంగా దాన్ని పంచమని నేను.అక్కడ డబ్బు ప్రసక్తి కోసం కాదు. సమానత్వం కోసం నా పోరాటం.
రిజిస్ట్రేషన్ రోజున మిగిలిన డబ్బు వేస్తానని నాకు మాట ఇచ్చి సంతకం పెట్టించారు పేపర్ మీద .అప్పటికీ మా వారు చెబుతూనే ఉన్నారు. బ్యాంకులో డబ్బులు వేసినది చూశాకే సంతకం పెట్టమని. అది ఆయన తప్పు కాదు. ఇన్నేళ్లు ఎంత ఇస్తే అంత పుచ్చుకున్నారు. వెయ్యి రూపాయల వస్తువు కొనుక్కోమని రెండు వందలు చేతిలో పెట్టిన రోజులున్నాయి. డబ్బు వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోతే ఎలా? అదీ ఆంధ్రాలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కూడా ఉంది చట్ట పరంగా.
ఇంజినీర్లయిన నా ఇద్దరు అన్నలు కూడా ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఎందరో ఆడపిల్లలు పుట్టింటి నుంచి డబ్బు తెచ్చుకున్నారు సమానంగా. కానీ నేను అలా చేయలేదు. మాది పల్లెటూరు. నేను సంతకం చేయకపోతే, రిజిస్ట్రేషన్ ఆగిపోతే నాన్నకి ఎంత తలవంపులు? ఇవ్వటం, ఇవ్వకపోవటం ఆయనకేవదిలేసి సంతకం చేసేశాను.
జీవితంలో ఆయన ఎప్పుడు మాట తప్పలేదు. కానీ నా విషయంలో తప్పారు. ఆ తర్వాత డబ్బు నా అకౌంట్లో వేయలేదు. అది వేరే విషయం. ఊరంతా నన్నే తప్పుబట్టింది. నా త్యాగాన్ని గుర్తించలేదు. అయినా నేను బాధ పడలేదు. నా ప్రయత్నం నేను చేశానని సరిపెట్టుకున్నాను. పైగా మీ పిల్లలకు నువ్వు ఆస్తి అలా సమానంగా పంచు అని సలహా ఇచ్చారు మా నాన్న. నీ భావాలు బాగుంటాయి అని కూడా మెచ్చుకున్నారు. చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలు ఇద్దరూ సమానమే. ఆయన చెప్పినా చెప్పకున్నా నేను అలాగే మా అమ్మాయికి మా అబ్బాయికి సమానంగానే ఇస్తాను.
దురదృష్టమో ఏమో ఆ తర్వాత కొన్నాళ్ళకి నాన్నకు పక్షవాతం వచ్చింది. అయ్యో! ఇలా జరిగిందే అని బాధ వేసింది. అదీ కాకుండా మాట తప్పిన వాళ్లకు పక్షవాతం వస్తుందని ఎవరో పెద్ద రచయిత రాసింది చదివాను. వెంటనే భగవంతునికి విన్నపం చేశాను నాన్నను అందులోంచి బయట పడవేయమని.దేవుడు నన్ను బాగా చూసుకుంటాడు ఎప్పుడూ. అడగకుండా అన్నీ ఇస్తాడు. అడిగినా ఇస్తాడు. ఆయనకు నేనంటే ఇష్టం. అలాగే ఆయన కోలుకున్నారు. నాకు చెప్పలేనంత ఆనందం వేసింది నాన్నకు తగ్గిందని. కానీ ఇదంతా దీని వల్లనే జరిగిందని అమ్మ అనటం మాత్రం మనసులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించేది. ఇందులో నా తప్పేముంది? కళ్లముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించమా? అది నాదైనా ఎవరిదైనా అలాగే పోరాడుతాను. పోరాడాను. అందులో నేను ఓడిపోలేదు. నాన్న మీద నా ప్రేమే గెలిచింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ ఆస్తులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ నాన్న నా మీద చూపించిన ప్రేమ ఎప్పటికీ పోదు. అందరికన్నా ప్రేమ ధనం నాకు నాన్న ఎక్కువే ఇచ్చారు. దాని ముందు అన్ని బలాదూరే.
బంధాన్ని మించింది ఏముంది? మీరే చెప్పండి! కానీ కడుపున పుట్టిన పిల్లలను అలా వేరు వేరుగా చూడకూడదన్న నా మాటను మీరు ఎవరు వ్యతిరేకించలేరు. నాన్నను సమర్ధించలేరు ఈ విషయంలో. అలాగే మా ఇద్దరి మధ్య గాఢంగా పెనవేసుకున్న ప్రేమను సైతం అనుకుంటూ
"తృప్తి" తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను.